దాంపత్యంలో బలవంతపు సెక్స్‌పై కోర్టు కీలక రూలింగ్.. అలా అనొద్దంటూ వ్యాఖ్య

By telugu teamFirst Published Aug 13, 2021, 1:20 PM IST
Highlights

పెళ్లయ్యాక భర్త బలవంతంగా సెక్స్ చేస్తే దాన్ని చట్టవిరుద్ధమని చెప్పలేమని ముంబయి కోర్టు ఓ రూలింగ్ ఇచ్చింది. పెళ్లి చేసుకున్న భర్త తనపై అక్రమ చర్యలకు పాల్పడ్డాడని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. పెళ్లాయ్యాక నెల రోజులకే భర్త తన సమ్మతి లేకుండానే, ఇష్టం లేకుండానే సెక్స్ చేశారని భార్య చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారించింది. భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ముంబయి: పెళ్లి చేసుకున్న తర్వాత దంపతుల మధ్య బలవంతపు సెక్స్‌పై ముంబయి కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. భర్త తన అంగీకారం లేకుండానే సెక్స్ చేశారన్న భార్య ఆరోపణలు చట్టబద్ధ విచారణకు సరితూగవని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లి చేసుకున్న భర్త తనపై అక్రమ చర్యలకు పాల్పడ్డాడని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. ముంబయి అదనపు సెషన్స్ జడ్జీ సంజశ్రీ జే ఘరాత్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఫిర్యాదు చేసిన మహిళ సదరు వ్యక్తితో గతేడాది నవంబర్ 22న వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాతే తనపై భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆంక్షలు పెట్టారని, తిట్లు, చీవాట్లూ పెట్టారని పోలీసులకు ఆమె వివరించింది. అదనంగా డబ్బునూ తన నుంచి డిమాండ్ చేశారని ఆరోపించింది. పెళ్లయిన నెల తర్వాత తన భర్త తన సమ్మతిని పరిగణనలోకి తీసుకోకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా సంభోగించాడని ఫిర్యాదు చేసింది.

జనవరి 2న ఈ దంపతులు ముంబయి సమీపంలోని మహాబలేశ్వర్ వెళ్లారు. అక్కడే ఆమెపై మరోమారు తన ఇష్టానికి వ్యతిరేకంగా సెక్స్ చేశాడని ఆరోపించింది. ఆ తర్వాతే తాను అనారోగ్యానికి గురయ్యిందని తెలిపింది. డాక్టర్‌ను సంప్రదించగా తన నడుము కిందిభాగంలో పెరాలసిస్‌కు లోనైనట్టు వివరించారని పేర్కొంది. ఆ తర్వాతే ముంబయిలో తన భర్తపై ఫిర్యాదు చేసినట్టు వివరించింది.

భర్త కుటుంబ సభ్యులు యాంటీసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వధువు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, అదనపు కట్నం డిమాండ్ చేయలేదని వాదించారు. తాము ఆమెను వేధించలేదని, తాము రత్నగిరిలో ఉంటామని, కేవలం రెండు రోజులే నవదంపతులతో గడిపామని వివరించారు. ఫిర్యాదు చేసిన వధువుపై ఆమె భర్త కూడా కేసు పెట్టారు. కాగా, భర్త దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. భార్య తరఫు న్యాయవాది బెయిల్ మంజూరును వ్యతిరేకించారు. దీనిపై స్పందిస్తూ అదనపు కట్నం అడుగుతున్నారని ఆరోపించారని, కానీ, ఎంతమొత్తంలో డిమాండ్ చేశారో పేర్కొనలేదని కోర్టు వివరించింది.

పెళ్లయ్యాక దంపతుల మధ్య బలవంతపు సెక్స్ ఆరోపణలకు చట్టబద్ధత ఉండదని న్యాయమూర్తి తెలిపారు. వివాహిత పెరాలసిస్‌కు లోనవ్వడం బాధాకరమని, కానీ, అందుకు భర్తను, ఆయన కుటుంబీకులను బాధ్యులు చేయలేమని వివరించారు. వధువు చేసిన ఆరోపణలను పరిశీలిస్తే కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. వారు విచారణకు సహకరించడానికీ సిద్ధంగానే ఉన్నారని తెలిపారు.

పెళ్లయినప్పటకీ సంగమించడానికి ఇరువురి సమ్మతి అవసరమని, ఏ ఒక్కరికీ ఇష్టం లేకున్నా భౌతికంగా కలవరాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

click me!