అరుణాచల్​ప్రదేశ్​లో చైనా గ్రామం.. క్లారిటీ ఇచ్చిన భద్రత అధికారులు..

By team teluguFirst Published Nov 10, 2021, 11:23 AM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం (Village) నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ (Pentagon) గత వారం ఓ నివేదికలో పేర్కొనడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భారత భద్రత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
 

అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం (Village) నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ (Pentagon) గత వారం ఓ నివేదికలో పేర్కొనడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చైనా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసుకుంటున్నట్టుగా ఆ నివేదికలో పేర్కొంది. చైనా వ్యుహాత్మక చర్యలను కొనసాగిస్తూనే ఉందని తెలిపింది. అయితే పెంటగాన్ నివేదిక భారత్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే తాజాగా దీనిపై భారత భద్రత వర్గాలు స్పందించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించినట్టుగా చెప్పబడుతున్న ప్రాంతం.. చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టుగా భద్రత వర్గాలు వెల్లడించాయి. ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా అధీనంలోనే ఉందని తెలిపాయి.

‘1959లో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌ను అధిగమించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించింది. ఆ ఘ‌ట‌న‌ను లాంగ్జూగా పేర్కొంటారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం వారి ఆధీనంలోనే ఉంది. ఆ ప్రాంతంలోనే వారు గ్రామాన్ని నిర్మించారు’ అని భద్రతా వర్గాలు తెలిపాయి. ఎగువ సుబంసిరి జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు వెంట ఉన్న గ్రామం చైనా నియంత్రణలో ఉందని పేర్కొన్నాయి. ఆ ప్రాంతంలో చైనా చాలా ఏళ్లుగా ఆర్మీ పోస్ట్‌ను నిర్వహిస్తుందని.. చైనీయులు చేపట్టిన వివిధ నిర్మాణాలకు తక్కువ సమయంలో పూర్తైనవి కావని వెల్లడించాయి. 

Also read: సరిహద్దులో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్.. వీడియో ఇదే..!

భారత్‌-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు.. అమెరికా ర‌క్షణ‌ శాఖ పెంటగాన్ తమ పార్లమెంటుకు ఓ నివేదిక‌ సమర్పించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను నివేదికకకు జతచేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సుబంసిరి జిల్లాలో ఉన్న షారి షూ నది ఒడ్డున ఆ గ్రామాన్ని కట్టినట్టు పేర్కొంది. ఆ ప్రాంతంపై భారత్, చైనా మధ్య 1962 యుద్ధానికి ముందు నుంచే గొడవలున్నాయని తెలిపింది.

Also read: అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా: 4.5 కి.మీ. భారత భూభాగంలోకి వచ్చిన డ్రాగన్

గల్వాన్ లోయ ఘర్షణ విషయాన్ని కూడా ఆ నివేదికలో ప్రస్తావించింది. చైనా సైన్యం భారత్ లోకి చొచ్చుకొచ్చిందని.. టిబెట్, అరుణాచల్ మధ్య గ్రామాన్ని కట్టిందని పేర్కొంది. 2020 మధ్యలో ఈ గ్రామాన్ని నిర్మించి ఉంటారని నివేదికలో ప్రస్తావించింది. గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నలుగురు పీఎల్‌ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్టుగా కూడా పేర్కొంది. 

click me!