బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసు : సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధానికి బాధితురాలి లేఖ..

By AN TeluguFirst Published Oct 3, 2020, 10:45 AM IST
Highlights

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి కేసులో బాధితురాలు సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మహేష్ నేగి తనపై అత్యాచారం చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి కేసులో బాధితురాలు సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మహేష్ నేగి తనపై అత్యాచారం చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నాలుగు పేజీల ఈ లేఖలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని, ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయస్థానం, పోలీసులు సరియైన దర్యాప్తు చేయకుండా ఎమ్మెల్యేను కాపాడుతున్నందుకే బాధిత మహిళ సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి లేఖ రాసిందని బాధితురాలి తరపు న్యాయవాది ఎస్పీ సింగ్‌ అన్నారు.  ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నా క్లయింట్‌ని అతనితో రాజీ కుదుర్చుకోవాలని కోరారు. అందువల్ల న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తును కోరుతూ ఆమె ప్రధానికి లేఖ రాశారు' అని ఎస్పీ సింగ్‌ తెలిపారు. 

అయితే ఈ వాదనను ఉత్తరాఖండ్‌ పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనపై దర్యాపు అధికారిని మార్చాలని మాత్రమే బాధితురాలు కోరినట్లు డెహ్రాడూన్‌ సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్ అరుణ్ మోహన్ జోషి అన్నారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై పోలీసులు గత నెలలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్యపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

మహేశ్‌ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆయన కారణంగా పాపకు జన్మనిచ్చానని ఓ మహిళ ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవసరమనుకుంటే తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె కోరింది. 

అయితే, మహేష్ నేగీ మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుల కుట్రలతోనే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ మేరకు ఎమ్మెల్యేపై దంపతులపై కేసులు నమోదు చేశారు. ద్వారాహత్‌ నియోజకవర్గం నుంచి నేగి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

click me!