త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్-వామపక్షాలు ఎందుకు కలిశాయంటే..? మాణిక్ సర్కార్ కీలక వ్యాఖ్యలు

By Mahesh RajamoniFirst Published Feb 6, 2023, 3:27 PM IST
Highlights

Tripura election: 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనుండగా, అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ - వామక్షాలతో కలిసి అధికార పీఠం కోసం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తోంది.
 

CPI (M) leader Manik Sarkar: త్రిపుర అసెంబ్లీ కి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రధాన రాజకయ పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం తమ ముందున్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవడం మొదలెట్టాయి. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనుండగా, అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ - వామక్షాలతో కలిసి అధికార పీఠం కోసం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లేదా సిపిఐ (ఎం) నాయకుడు మాణిక్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి రాజకీయాల్లో తన కెరీర్ ప్రారంభించిన తర్వాత 20 సంవత్సరాలు త్రిపుర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. మణిక్ సర్కార్ 1980లో తన మొదటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి, 2018లో భారతీయ జనతా పార్టీ (BJP) మొదటిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సర్కార్ ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నుండి వైదొలగడానికి గల కారణాన్ని, కోల్పోయిన కోటను తిరిగి పొందేందుకు లెఫ్ట్ ఫ్రంట్ చేస్తున్న ప్రయత్నం మొదలైనవాటిని వివరించాడు.

త్రిపుర ప్రజలకు ఉపాధి లేదు, తిండి లేదు, ఆకలి మంటలు మాత్రమే మిగిలాయి.. ఇది కేవలం ఒక పార్టీ (BJP) నియంతృత్వ పాలన. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సీపీఎం, కాంగ్రెస్ చేతులు కలిపాయి : మాణిక్ సర్కార్

ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. "ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అనుమతించినప్పుడు నేను చిన్నవాడిని. ఇప్పుడు చాలా మంది కొత్త ముఖాలు వస్తున్నాయి. వారికి చోటు కల్పించి భవిష్యత్తులో బాధ్యతలు చేపట్టేలా తీర్చిదిద్దాలి. నన్ను నేను ఒక ప్రదేశానికి పరిమితం చేయలేను. రాష్ట్రం మొత్తాన్ని చూడాలి" అని అన్నారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులతో సహా అనుభవజ్ఞులైన నాయకులు లేకపోవడం లెఫ్ట్ ఫ్రంట్ అవకాశాలను ప్రభావితం చేయదా? అని అడగ్గా... "ఇది దీనికి విరుద్ధంగా ఉండవచ్చు. దాదాపు 50 శాతం మంది కొత్త ముఖాలను పరిచయం చేశాం. నామినీలు కొత్త రక్తం. ఇది పాజిటివ్ సైడ్. అదే సమయంలో నెగెటివ్ సైడ్స్ ఉంటాయి. మా నామినీలను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా వాటిపై పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ చర్యలు మాజీ మంత్రులను తప్పించినట్లు కాదు. ఇదంతా వ్యూహంలో భాగంగానే జరిగింది" అని తెలిపారు.

లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లకు హింసాత్మక చరిత్ర ఉంది. కూటమిని ఎలా మేనేజ్ చేశారు? అని అడగ్గా... "బీజేపీని ఓడించడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాతావరణాన్ని, రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి, ప్రజలకు ఉద్యోగాలు, ఆహారం అందించడానికి మేము ఒక్కటయ్యాం. మేము ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నాము. కానీ బీజేపీ ఈ పరిస్థితిని సృష్టించింది. ప్రతిపక్షాలపై వారి ఫాసిస్టు దాడులే మమ్మల్ని ఏకతాటిపైకి తెచ్చాయని" అన్నారు. అలాగే, "ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలను రాజకీయ కార్యకలాపాలకు పరిమితం చేశారు. గత ఐదేళ్లలో మీడియాపై కూడా దాడులు జరిగాయని" తెలిపారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని మాణిక్ సర్కార్ విజ్ఞప్తి చేశారు. "ఎన్నికలు వచ్చాయని, కలిసి పోరాడగలమా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. మేం దానికి ఒప్పుకున్నాం. అందుకే బీజేపీ పై కలిసి పోరాటం చేస్తున్నాం" అని తెలిపారు. ఉమ్మడిగా ప్రచారం చేస్తారా? అని అడగ్గా.. "ఇది ఇప్పటికే ప్రారంభమైంది. మా మద్దతుదారులు ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ కోసం, మా అభ్యర్థుల కోసం మాట్లాడతారు" అని అన్నారు. 'ప్రజాస్వామ్య పునరుద్ధరణ.. లౌకిక స్వరూపం నాశనమైంది. పౌరహక్కులను, స్వేచ్ఛగా ఓటు హక్కును కాలరాస్తున్నారు. మైనార్టీలకు ముప్పు పొంచి ఉంది. ఇవి కీలకమైన అంశాలు' గా వున్నాయని కూడా తెలిపారు.

click me!