PM Modi Nomination: ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో ఆయన వెంట నలుగురు ఉన్నారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? అనే అంశం చర్చనీయంగా మారింది.
PM Modi Nomination: పార్లమెంట్ ఎన్నికలు 2024 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నేడు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ముందుగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న దశాశ్వమేధ ఘాట్‌లో ప్రార్థనలు చేశారు. వేద మంత్రాలు పఠిస్తూ గంగానదీ తీరంలో హారతి పట్టారు. అక్కడి కాల భైరవ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌కి చేరుకున్నారు.
సరిగ్గా ఉదయం 11:40 గంటలకు ప్రధాని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సమయంలో ప్రధాని మోడీ 2 సెట్లలో నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ తనను కుర్చీపై కూర్చోమని కోరినప్పటికీ నామినేషన్ సమర్పించేవరకూ ప్రధాని నామినేషన్ గదిలోనే నిలబడి ఉన్నారు. నామినేషన్ సమర్పించిన తర్వాత కూర్చున్నారు.
ఇంతకీ ఆ నలుగురు ఎవరు?
ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరో నలుగురు పాల్గొన్నారు. ఇంతకీ వారెవరు? అనే చర్చ జోరుగా సాగుతుంది. నరేంద్ర మోడీ నామినేషన్ వేసిన సమయంలో ఆయన వెంట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి. ఇతడు రామమందిరం శుభ సమయాన్ని నిర్ణయించారు. వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాలంటీర్ బైజ్‌నాథ్ పటేల్, ఓబీసీ సామాజిక వర్గానికే చెందిన లాల్‌చంద్ కుష్వాహా, దళిత నాయకుడు సంజయ్ సోంకర్ తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
అలాగే.. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రాందాస్ అథవాలే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాని పవన్ కల్యాణ్, సంజయ్ నిషాద్, హర్దీప్ సింగ్ పూరి, జితన్ రామ్ మాంఝీ, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌తో సహా పలువురు ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
అట్టహాసంగా
మరోవైపు ప్రధాని మోదీ నామినేషన్‌తో వారణాసి సంబరాలతో నిండిపోయింది. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వారణాసి వీధులన్నీ మోడీ ప్రభంజనంతో హోరెత్తాయి. వారణాసిలో ప్రధాని ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ‘ఆప్ కీ బార్, మోడీ సర్కార్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.