తెలంగాణలో పోలింగ్ కు ఇంకా మూడు రోజులో ఉంది. దీంతో పోటాపోటీ ప్రచారం సాగుతోంది. చైనాలో నిమోనియా కలవరపెడుతోంది. పోలింగ్ కు 50వేలమంది పోలీసులకు గట్టి బందోబస్తు, ఓటర్లకు ఇంకా అందని ఓట్ల స్లిప్పులు, తెలంగాణలో డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్.. ఇలాంటి వార్తల టాప్ టెన్ స్టోరీస్ ఇవి...
రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి కాపాడేది బిజెపీనే…
తెలంగాణలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జరిగిన బహిరంగ సభలో తెలిపారు. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్లో నాశనం చేశాయని వాటి నుంచి రాష్ట్రాన్ని రక్షించేది బిజెపీనే అని మోడీ అన్నారు. ఆదివారం నాడు తూఫ్రాన్, నిర్మల్ లలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ఢిల్లీలో ఓ పార్టీ నేతతో చేతులు కలిపారని, మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ నుంచి తెలంగాణను కాపాడేది బిజెపి అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
ఆరు గ్యారంటీల అమలు బాధ్యత అధిష్టానానిదే...
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నెరవేరుస్తానన్న ఆరు గ్యారెంటీ ల అమలు బాధ్యత అధిష్టానానిదే అని ఖర్గే చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఓట్ల కోసమే మోడీ ఎస్సీ వర్గీకరణకు ఎత్తుగడ వేశాడని ఆరోపించారు. తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీకి గ్రూప్ వన్, గ్రూప్ టు, గ్రూప్ త్రీ ఇలా కేటగిరీలో వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇస్తామో గడువు తేదీలతో సహా పేర్కొన్నామని చెప్పారు. ఆ ప్రకారమే పక్కాగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కెసిఆర్ ది ఏక వ్యక్తి పార్టీ అని విరుచుకుపడ్డారు. అందుకే ఆయన హామీలు ఇచ్చి తప్పినా.. ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే అధిష్టానం వాటిని అమలయ్యేలా చేస్తుందని చెప్పుకొచ్చారు.
గాలి లేదు.. గత్తర లేదు…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం నాడు జగిత్యాల వేములవాడ, ఖానాపూర్, దుబ్బాకలలో ప్రజా ఆశీర్వాద సభలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ క్రమంలోకెసిఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గాలి వీస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ‘గాలి లేదు.. గత్తర లేదు…’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎట్లుందో బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ గాలి వీస్తోందని.. భారీ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. తిట్టడానికి తప్ప కాంగ్రెస్ వాళ్లు ఎందుకు పనికిరారు ఆ పార్టీలో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు.
డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్
డిసెంబర్ 4న అధికారంలోకి రాగానే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 4న అధికారులతో కలిసి తానే స్వయంగా అశోక్ నగర్ వెళ్తానని, ఉద్యోగార్థులతో కలిసి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ ఒకటి ‘ఫూల్స్ డే’ అని ఆ రోజున జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని తెలిసి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారని.. నమ్మడానికి తెలంగాణ పిల్లలు అంత తెలివి లేని వాళ్ళలా కనిపిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలకు ఆగం కావద్దని తెలిపారు. వారిద్దరు ఎప్పుడైనా పరీక్షలు రాశారా, ఉద్యోగాలు చేశారా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురించింది.
రాహుల్ గాంధీకి ఉద్యోగమంటే ఏంటో తెలుసా ?
తెలంగాణ సంపదంత ఒకే కుటుంబం దోచుకుంటుంది..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ప్రచార సభలో బిజీబిజీగా తిరుగుతున్నారు. ఆదివారంనాడు సంగారెడ్డి, కామారెడ్డి, ఆందోల్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంపదంత ఒకే కుటుంబం దోచుకుంటుందని ధరణి పోర్టల్ తో 20 లక్షల మంది రైతుల భూములు లాక్కున్నారన్నారు. ప్రాజెక్టును సాగునీరు ఇవ్వడం కోసం నిర్మించలేదని దోపిడి కోసమే డిజైన్ మార్చి, నిర్మించారని అన్నారు కామారెడ్డిలో బీఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా పడొద్దని రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి మంత్రిమండలి సమావేశంలోనే 6 గ్యారంటీల అమలుకు చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మోడీనీ, తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వార్తను ఈనాడు ప్రచురించింది.
కారు నాలుగు టైర్లలో గాలిపోయింది .. రాహుల్ గాంధీ
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ..
ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఘన స్వాగతం తెలిపారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు విమానాశ్రయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. స్వాగత సత్కారాల తర్వాత ప్రధాని విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. దీనికి సంబంధించిన వార్తని సాక్షి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
చైనాలో నిమోనియాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత..
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు కలవర పెడుతుండడం మీద భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దీనిమీద ఆదివారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు తమ పరిధిలో సమగ్ర స్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని తెలిపింది. ఉత్తర చైనాలో చిన్నపిల్లల్లో శ్వాస సంబంధ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న ఉధృతి కనిపిస్తుంది. దీనిమీద భారత్ ఇప్పటికిప్పుడు భయపడాల్సిన పనిలేదు కానీ.. దీన్ని ప్రభుత్వం నిషితంగా పరిశీలిస్తుంది. ఇది మన దేశంలో ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దీని మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సన్నద్ధంగా ఉండేలా సమీక్ష నిర్వహించుకోండి అని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి మొదటి పేజీలో ప్రచురించింది.
కర్మ వీర చక్ర పురస్కారాన్ని అందుకోనున్న అనంతరైతు
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన ఓ రైతును కర్మ వీర చక్ర అవార్డు వరించింది. 30 సెంట్లు విస్తీర్ణంలో ఏడాది పొడవునా.. 20 రకాల పంటలు పండిస్తూ అందరితో భేష్ అనిపించుకుంటున్నాడు అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే రైతు. ఆయన చేస్తున్న ఈ ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించి ఐక్యరాజ్యసమితి ఆర్ఈఎక్స్ కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ పురస్కారానికి నారాయణప్పను ఎంచుకున్నారు. దివంగత శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి ప్రముఖంగా ప్రచురించింది..
పోలీసు బలగం…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 50 వేల మంది పోలీసులతో నిఘా ఏర్పాటు, కట్టుదిట్టమైన భద్రతాచర్యలు ఏర్పాటు చేసినట్లుగా.. ఆంధ్రజ్యోతి ఓ ప్రత్యేక కథనాన్ని మొదటి పేజీలు ప్రచురించింది. సీసీటీవీలతో పర్యవేక్షణ, పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కావలసిన అన్ని రకాల చర్యలను ఏ విధంగా తీసుకుందో వివరాత్మకంగా చెప్పుకొచ్చింది. ఒక్కో కమిషనరేట్ కు 20 కంపెనీల చొప్పున వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలు వచ్చాయి. రాచకొండ, సైబరాబాద్ లలో కలిసి మొత్తం 12 వేలమంది వీరితో కలిసి బందోబస్తులో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించింద.
ఓటర్లకు చేరని స్లిప్పులు
తెలంగాణలో ఎన్నికలు ఇక నాలుగు రోజుల ముంగిట్లోకి చేరిన సమయంలో ఇప్పటికీ ఓటర్లకు స్లిప్పులు అందలేదు. హైదరాబాదులోని అంబర్పేట్ నియోజకవర్గం లోని గోల్నాకలోని పలు ప్రాంతాల్లో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ఇప్పటికీ అందలేదు. ఇక్కడే కాదు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది ఆఫీసులకు వచ్చి స్లిప్పులను కలెక్ట్ చేసుకోవాల్సిందిగా చెబుతుండడంతో.. కొంత గందరగోళం ఏర్పడుతుంది. మరోవైపు పార్టీ అభ్యర్థులు కరపత్రంలో ఓటర్, పోలింగ్ బూత్ వివరాలు ముద్రించి ఇంటింటికి అందజేస్తున్నారు. దీనిమీద ‘ స్లిప్పులు అందలే’ అనే పేరుతో ఆంధ్రజ్యోతి ఓ వార్తను మొదటి పేజీలో ప్రచురించింది.