బాలికలు, మహిళల సంక్షేమం కోసం మోదీ తీసుకొచ్చిన స్కీమ్స్ ఇవే..

By Sumanth KanukulaFirst Published Sep 16, 2022, 8:17 AM IST
Highlights

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలికల, మహిళల సంక్షేమంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారి కోసం పలు పథకాలను తీసుకొచ్చారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలికల, మహిళల సంక్షేమంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఉన్నత చదువుకు నోచుకోవడం  లేదు. చట్టవిరుద్ధమైనప్పటికీ మారుమూల ప్రాంతాల్లో బాల్యవివాహాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి.. బాలికలను చదివేందుకు తల్లిదండ్రులకు మద్దతు ఇచ్చే అనేక పథకాలను మోదీ ప్రభుత్వం రూపొందించింది.  అలాగే సమాజంలో మహిళ ఉన్నతికి, అభివృద్దికి సహకరించే కార్యక్రమాలను చేపట్టింది. శనివారం (సెప్టెంబర్ 17) రోజున ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆ పథకాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం.. 

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై).. ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఆడపిల్లల భవిష్యత్తు చదువులు, వివాహ ఖర్చుల కోసం పెట్టుబడి పెట్టడానికి, నిధులను నిర్మించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తుంది. పదేళ్లలోపు వయసు ఉన్న వారు మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు. కేవలం రూ. 250తో సుకన్య అకౌంట్ తెరవొచ్చు. ఏడాదిలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 15 ఏళ్ల పాటు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే(ఏడాదికి రూ. 60 వేలు) మెచ్యూరిటీ సమయంలో రూ. 25 లక్షలకు పైగా వస్తాయి.  మీరు 15 సంవత్సరాల పాటు వార్షిక ప్రాతిపదికన 1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రస్తుత వడ్డీ రేటు 7.60 శాతం ప్రకారం రూ. 43.5 లక్షల వరకు వస్తాయి. 

బేటీ బచావో-బేటీ పడావో..
ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న బేటీ బచావో-బేటీ పడావో(కుమార్తెను కాపాడండి.. కుమార్తెను చదివించండి) పథకాన్ని ప్రారంభించారు. లింగ వివక్షను అంతం చేయడం, బాలికల సంక్షేం ఈ పథకం ముఖ్య లక్షం. అలాగే ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడం. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ  సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 

పీఎం ఉజ్వల యోజన
కాలుష్యం కలిగించే వంట ఇంధనాలు, పద్ధతుల నుంచి మహిళలను వంట గ్యాస్ వైపు మళ్లించేందుకు ఈ పథకాన్ని 2016 మే లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ సమయంలో.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెరుగుతున్న ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని SC, ST వర్గాల వంటి మరో ఏడు కేటగిరీలకు చెందిన మహిళా లబ్ధిదారులను చేర్చడానికి 2018 ఏప్రిల్ ఈ పథకం లక్ష్యాన్ని 8 కోట్లకు సవరించారు. ఈ స్కీమ్‌ ద్వారా కట్టెలు సేకరించడం, వంట చేసేటప్పుడు ఎదురయ్యే కాలుష్య కారకాల నుంచి మహిళలకు ఉపశమనం కలిగించింది. 

పీఎంఎంవీవై, పీఎంఎస్‌ఎంఏ..
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింది గర్భిణి మహిళలకు రూ. 5 వేలు అందజేస్తారు. మూడు విడతల్లో ఈ మొత్తం మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తారు. తొలి విడత కింద రూ.1000 వస్తాయి. తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో రూ.2 వేలు వస్తాయి. తొలి ప్రసవానికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. పీఎంఎంవీవై నుంచి 2.4 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు.

ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్‌ఎంఏ) కింద ప్రతి గర్భిణికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉచితంగా మందులు, భోజనం, రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా నూటికి నూరు శాతం ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకుంటారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ స్కీమ్‌ను నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం పీఎంఎస్‌ఎంఏ కింద 3.11 కోట్లకు పైగా ఉచిత ప్రసూతి పరీక్షలు నిర్వహించబడ్డాయి.

ఇక, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షలాది ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నారు. ఆ గృహాల యజమానులుగా మహిళలకు అధికారం ఇవ్వబడుంది. ఇది గృహ నిర్ణయాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుంది. మరోవైపు 2021 నవంబర్ 26 నాటి గణంకాల ప్రకారం.. ప్రధాన మంత్రి ముద్రా యోజన ఖాతాలలో 68 శాతం మహిళ వద్ద ఉన్నాయి. వారు ఈ పథకం కింద మంజూరైన మొత్తంలో 44 శాతాన్ని పొందారు. అలాగే మహిళల ఆరోగ్యం, సౌకర్యం, గౌరవాన్ని మెరుగుపరిచే అనేక కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టింది. 

click me!