Latest Videos

Lok Sabha elections 2024 Phase 6 : ఆరో దశ పోలింగ్ షురూ... పోటీలో ఇద్దరు మాజీ సీఎంలు..

By Arun Kumar PFirst Published May 25, 2024, 8:07 AM IST
Highlights

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆరోదశ పోలింగ్ జరుగుతోంది. ఇద్దరు మాజీ సీఎంలతో పాటు పలువురు కేంద్రమంత్రులు, కీలక నాయకులు ఈ దశలో పోటీలో వున్నారు... వారి భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తం కానుంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా వున్న అన్ని లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి... ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇవాళ(శనివారం) ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉదయమే పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు. 

ఆరో దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 14, హర్యానాలో 10, బిహార్ లో 8, పశ్చిమ బెంగాల్ లో 8, డిల్లీలో 7, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 4,  జమ్మూ కాశ్మీర్ లో 1 స్థానంలో పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా ఈ దశలో 11 కోట్లకు పైగా ఓటర్ల తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.  కాాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు డిల్లీలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

ఇద్దరు మాజీ సీఎంలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ  పార్టీలకు చెందిన కీలక నాయకులు ఆరో దశ పోటీలో నిలిచారు. అనంత్ నాగ్ రాజౌరీ లోక్ సభ నుండి జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తీ, కర్నాల్ లోక్ సభ నుండి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్ పూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక సంబిద్  పాత్ర, మేనకా గాంధీ,  సోమనాథ్ భారతి, బన్సూరీ స్వరాజ్, రాజ్ బబ్బర్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ తదితరులు కూడా ఆరో దశ ఎన్నికల పోటీలో నిలిచారు. మొత్తంగా 889 మంది అభ్యర్థులు ఈ దశలో పోటీపడుతున్నారు.

ప్రస్తుతం ఆరోదశ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో అత్యధికం ప్రస్తుతం ఎన్డిఏ కూటమి ఖాతాలోనే వున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ 58 సీట్లలో  51 చోట్ల ఎన్డీఏ గెలిచింది... కేవలం 7 చోట్ల మాత్రమే ఇతరులు గెలిచారు. ఈసారి కూడా ఈ స్థానాల్లో  గెలుపు తమదేనన్న ధీమాతో బిజెపి నేతృత్వంలోని కూటమి వుంది. ప్రతిపక్ష ఇండి కూటమి కూడా అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమాతో వుంది. 

దేశ రాజధాని డిల్లీలో ఆసక్తికర పోరు సాగుతోంది. గతంలో ఏడుకు ఏడు స్థానాలను బిజెపి గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈసారి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ లు కలిసి డిల్లీ బరిలో నిలిచాయి. మరి రాజధాని ప్రజలు ఎవరకి పట్టం కడతారో చూడాలి... ఇవాళ ప్రజాతీర్పు ఈవిఎంలలో నిక్షిప్తం కానుంది. 

ఇవాళ ఆరోదశ పోలింగ్ ముగిస్తే ఇక ఏడో దశ ఎన్నిక మాత్రమే మిగిలివుంటుంది. ఆ దశ పోలింగ్ కూడా వచ్చెే నెల ఫస్ట్ అంటే జూన్ 1న ముగుస్తుంది... దీంతో  దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవుతుంది. దీంతో జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వుంటుంది. 

click me!