Latest Videos

ఏ అనుమతి లేకుండానే పాక్ లో అడుగుపెట్టా.. ఇదీ భారత్ సత్తా..: ప్రధాని మోదీ మాస్ రిప్లై

By Arun Kumar PFirst Published May 25, 2024, 9:57 AM IST
Highlights

2015 లో తన పాకిస్థాన్ పర్యటన గురించి తాజాగా స్పందించారు ప్రధాని మోదీ.  ఆ దేశం ఎంత శక్తివంతమైందో స్వయంగా చూసానంటూ కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు ప్రధాని. 

న్యూడిల్లీ : అది డిసెంబర్ 25, 2015. భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్ఘానిస్తాన్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. నేరుగా ఇండియాకు రాకుండా పాకిస్థాన్ లో అడుగుపెట్టారు. అనూహ్యంగా లాహోర్ లో ప్రధాని విమానం దిగింది... అక్కడినుండి  ఆనాటి పాక్ ప్రధాని నవాజ్ షరీప్ నివాసానికి వెళ్ళారు మోదీ. ఆరోజు షరీఫ్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. ఇలా 2004 తర్వాత అంటే పదేళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పాక్ లో అడుగుపెట్టారు. 

భారత ప్రధాని మోదీ పాక్ పర్యటన ఆనాడు సంచలనంగా మారింది. తాజాగా ఈ ఆకస్మిక పర్యటనపై మోదీ స్పందించారు. తాను లాహోర్ వెళ్లడం వెనక బలమైన కారణమే వుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల వేళ తన పాక్ పర్యటనను రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేందుకు ఉపయోగించుకున్నారు మోదీ.   

పాక్ పర్యటనపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..: 

ఇటీవల భారత్ కంటే పాకిస్థాన్ బలమైన దేశమంటూ   కొందరు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ అయితే పాక్ తో భారత్ జాగ్రత్తగా వుండాలి... ఎందుకంటే ఆ దేశంవద్ద అణుబాంబులు వున్నాయంటూ మోదీ సర్కార్ ను హెచ్చరించారు. పాక్ ను గౌరవించాలంటూ అయ్యర్ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన పాకిస్థాన్ పర్యటన గురించి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

2015 లో తాను ఆకస్మికంగా పాకిస్థాన్ కు వెళ్లింది ఆ దేశం ఎంత శక్తివంతమైదో పరిశీలించడానికేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని తెలిపారు. కనీసం వీసా కూడా లేకుండానే నేరుగా పాక్ లో అడుగుపెట్టానని మోదీ తెలిపారు. ఇదే విషయాన్ని పాక్ జర్నలిస్ట్ ఒకరు తనను అడిగారని... ఒకప్పుడు ఈ నేల కూడా భారత్ లో భాగమే కదా అని తాను సమాధానం చెప్పినట్లు మోదీ గుర్తుచేసారు. ఇలా శతృదేశంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా పర్యటించానని ... ఇది భారత్ సత్తాకు నిదర్శనం అనేలా కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు మోదీ. 

ఇక పాకిస్థాన్ ప్రస్తుతం ఆందోళనలో వుంది... అందుకు తానుకూడా ఓ కారణమని మోదీ తెలిపారు.  కొందరు కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ పై సానుభూతి చూపిస్తున్నారని... ఒకరు ఆ దేశం చాలా శక్తివంతమైందని, మరొకరు మనదేశంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది కసబ్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లు అవుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

రాహుల్ ను ప్రధాని కావాలని పాక్ కోరిక : మోదీ 

ఇక ఇటీవల పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ హుసేన్ కాంగ్రెస్ నేత రాహుల్ పై ప్రశంసలు కురిపించడంపైనా ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తమకు అనుకూలంగా  వుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని... రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్ అంటే ఎంతో ఇష్టమని... అందువల్లే వారిమధ్య స్నేహం కుదిరిందన్నారు. ఇంతకాలంగా వారిమధ్య సాగుతున్న రహస్య స్నేహం ఇప్పుడు బట్టబయలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


 
  
 

click me!