యాక్ట్ ఆఫ్ గాడ్ వ్యాఖ్యలు: దేవుడిని ఏ కోర్టులో విచారిస్తారంటూ నిర్మలపై సంజయ్ రౌత్ విమర్శలు

By Siva KodatiFirst Published Sep 6, 2020, 4:56 PM IST
Highlights

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్ 19 ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఈ పరిస్ధితిని దేవుడి చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్) అంటూ నిర్మల వ్యాఖ్యానించారు. 

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్ 19 ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఈ పరిస్ధితిని దేవుడి చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్) అంటూ నిర్మల వ్యాఖ్యానించారు. దీనిపైనే రౌత్ మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడిని నిందించడం హిందుత్వకు అవమానకరమని ఆయన శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్ధిక మంత్రి చెప్పడం సరైంది కాదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వైఫల్యాన్ని దేవుడిపై నెపం వేసి ఎలా చేతులు దులుపుకుంటారని ఆయన నిలదీశారు. దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిస్తారని సంజయ్ ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్రమోడీపైనా సంజయ్ విమర్శలు గుప్పించారు. మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారని.. దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరని విమర్శించారు.

నోట్ల రద్దు నుంచి లాక్‌డౌన్ వరకు సాగిన ప్రయాణంలో మన ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యమైందని సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్ధికంగా చేయూతను అందించాయని రౌత్ చెప్పుకొచ్చారు.

ఆ ప్రభుత్వాలు కోవిడ్ సమస్యను దైవ ఘటనగా చూడటం లేదని, కేవలం ఆర్ధిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ప్రభుత్వాలు ఆదుకున్నాయని సంజయ్ గుర్తుచేశారు. 

click me!