Sedition Law: రాజద్రోహ చట్టంపై స్టే.. సుప్రీంకోర్టు ఆదేశాల్లోని ఐదు కీలక అంశాలు

By Mahesh KFirst Published May 11, 2022, 2:31 PM IST
Highlights

రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం 124ఏ చట్టాన్ని సమీక్షిస్తామని అంగీకరించిన తర్వాత సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ స్టే ఆదేశాల్లోనే సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అందులో ఐదు కీలకమైన విషయాలను చూద్దాం.
 

న్యూఢిల్లీ: రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన ఆదేశాలు వెలువరించింది. ఈ వలసవాద చట్టంపై స్టే విధించింది. ఐపీసీలోని 124ఏ (రాజద్రోహం) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌ల విచారణలో తొలుత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించడానికి అంగీకరించలేదు. కానీ, ఆ తర్వాత రాజద్రోహ చట్టాన్ని సమీక్షించడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టంపై స్టే విధించింది. ఈ ఆదేశాల్లో ఐదు కీలక అంశాలను పరిశీలిద్దాం.

భారత దేశం వలసవాదుల పాలనలో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితుల కోసం ఈ చట్టాన్ని అమలు చేశారు. కానీ, ప్రస్తుత భారత పరిస్థితుల్లో ఈ చట్టం ప్రాసంగికతను కలిగి లేదు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దీన్ని సమీక్షించాలి అని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ రాజద్రోహ చట్టాన్ని పూర్తిగానే దూరం పెట్టడం మంచిదని కోర్టు అభిప్రాయపడింది. 

కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించడం పూర్తయ్యే వరకు దీన్ని అమలులో లేకుండా ఉంచాలని వివరించింది. కాబట్టి, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు కాకుండా, ఈ చట్టం కిందే విచారణను కొనసాగించకుండా, ఈ చట్టంలోని కఠిన నిబంధనలను అమలు చేయకుండా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

రాజద్రోహ చట్టాన్ని సమీక్షిస్తున్న కాలంలో ఎక్కడైనా.. ఎవరిపైనా అయినా ఈ చట్టాన్ని ప్రయోగించి కేసు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాదు, ఆ కేసును అత్యధిక వేగంతో ముగిస్తామని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది.

124ఏ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని అమలు చేయాలనే చెప్పవచ్చని వివరించింది.

దేశ వ్యాప్తంగా 800కి పైగా దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు కింద 13 వేల మంది జైలుల్లో ఉన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. 

దేశ ద్రోహం కింద అరెస్టైన వారు బెయిల్ కూడా ధరఖాస్తు చేసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది.ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా  ఉండాలనే విధానం సరైంది కాదని కేంద్రం తరపున ఉన్నత న్యాయస్థానంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ఎస్పీ ర్యాంక్ అధికారి ఆమోదిస్తేనే ఈ చట్టం కింద కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని తుషార్ మెహతా చెప్పారు.  పెండింగ్ కేసులను న్యాయపరమైన పోరమ్ ముందు పరిశీలించాలని కూడా మెహతా సుప్రీం ముందుంచారు.

పౌరుల  హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యం అవసరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. దేశ ద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

click me!