
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరారు. జూన్ 19న భారత్‌కు తిరిగి రానున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మొదట సైప్రస్‌ను సందర్శిస్తారు. జూన్ 15-16 తేదీల్లో ఆయన అక్కడే బస చేస్తారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానంతో ఈ పర్యటనను ప్రారంభించిన మోదీ, రెండు దశాబ్దాల తర్వాత ఈ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత ప్రధాని కావడం గమనార్హం. భారత్-సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల పరంగా ఇది మైలురాయిగా పరిగణించబడుతోంది.
పర్యటనలో రెండో దశగా ప్రధాని మోదీ జూన్ 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ జరిగే G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంతో ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వరుసగా ఆరోసారి ఈ గ్లోబల్ ఫోరమ్‌కు హాజరుకాబోతున్న మోదీ, చరిత్ర సృష్టించనున్నారు.
ఈ సమావేశంలో ఇంధన భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, గ్లోబల్ సమగ్రత వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. G7 దేశాల నాయకులతో పాటు, ఆహ్వానిత ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ పర్యటన చివరి దశలో, జూన్ 18న ప్రధాని మోదీ క్రొయేషియాకు చేరుకుంటారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని కూడా అధికారికంగా క్రొయేషియాను సందర్శించకపోవడం విశేషం. ఈ పర్యటన ద్వారా మోదీ క్రొయేషియా వెళ్లిన తొలి భారత ప్రధాని అవుతారు. అక్కడి ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ, ఆర్థిక సహకారం, పర్యాటక పరస్పర సంబంధాలు తదితర రంగాల్లో చర్చలు జరగనున్నాయి.
ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ చేపట్టిన ఈ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల తరుణంలో జరిగిన ఈ పర్యటన, అంతర్జాతీయంగా భారత వైఖరిని సమర్థవంతంగా వివరించేందుకు ఉపయోగపడుతుంది. మూడు దేశాల్లో జరిగే ద్వైపాక్షిక సమావేశాలు, గ్లోబల్ ఫోరమ్‌లలో పాల్గొనడం ద్వారా భారత అభిప్రాయాలను బలంగా ప్రదర్శించే అవకాశం ప్రధానికి లభిస్తోంది.