iran israel war: కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఓవైసీ కీల‌క విజ్ఞ‌ప్తి.. ఇరాన్‌, ఇజ్రాయిల్ ఉద్రిక్త‌త‌ల వేళ

Published : Jun 15, 2025, 07:23 AM IST
Asaduddin Owaisi

సారాంశం

ఇరార్‌, ఇజ్రాయిల్‌ల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. కాగా ఈ ఉద్రిక్త‌త‌ల వేళ హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

ఇరాన్‌, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. ఇరాన్‌, ఇరాక్‌లలో చిక్కుకున్న భారతీయులను తక్షణమే స్వదేశానికి తీసుకురావాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

‘ఎక్స్‌’లో ఓ పోస్ట్‌ ద్వారా ఈ విషయం వెల్లడించిన ఒవైసీ... టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 140 మంది వైద్య విద్యార్థులతో సహా, మొత్తం 1,595 మంది భారతీయులు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకుపోయారని తెలిపారు. అలాగే, ఇరాక్‌లో ఉన్న 183 మంది భారతీయ యాత్రికులు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌న్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ ఆనంద్ ప్రకాష్‌ను ఇప్పటికే సంప్రదించానని, అక్కడ చిక్కుకున్నవారి పూర్తి సమాచారం ఇచ్చానని ఒవైసీ తెలిపారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా స్పందించాలని, త్వరితగతిన వారిని రప్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు స్పష్టంగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, పర్యాటకులు కూడా అక్కడ ఉన్నందున, వారిని సురక్షితంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పోషించాలని ఒవైసీ కోరారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయాన్ని కూడా ఆయన సంప్రదించినట్లు తెలిపారు.

ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో, అక్కడ ఉన్నవారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. అందుకే ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఒవైసీ స్పష్టంగా అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !
Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu