పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కేంద్రానికి తమ పూర్తి మద్దతు ప్రకటించాయి.
Pahalgam Terrorist Attack : పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులపై దాడిచేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. దీంతో ఉగ్రవాదులనే కాదు వారికి సహాయం చేసిన పాకిస్థాన్ పై కఠిన వైఖరితో అవలంభిస్తోంది మోదీ సర్కార్. ఇప్పటికే పాకిస్థాన్ తో విబేధాలు కొనసాగుతుండగా తాజా ఘటనతో తెగతెంపులు చేసేసుకుంది భారత్. ఇందుకోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే ఉగ్రవాదాన్ని అరికట్టడం, పాకిస్థాన్ పై తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు గురువారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పహల్గాం దాడిలో భద్రతా లోపం జరిగిందని అంగీకరించింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని... ఈ విషయంలో ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉన్నామని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వంతో కలిసి ఉంటామని ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ... అఖిలపక్ష సమావేశం బాగా జరిగిందని, అందరూ CCS (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) నిర్ణయానికి మద్దతు తెలిపారని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కూడా మద్దతు ఇస్తామని అన్నారు.
ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానం 'జీరో టాలరెన్స్' అని స్పష్టం చేశారు. ప్రస్తుతం, భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రభుత్వ చర్యలన్నింటికీ తమ మద్దతు ఉందని చెప్పారు. శుక్రవారం కాశ్మీర్‌లోని అనంతనాగ్‌కు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారిని పరామర్శిస్తానని తెలిపారు.
ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభంలో అన్ని పార్టీల నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అనంతరం రెండుగంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదంపై ప్రభుత్వం చేసే పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని అన్నిపార్టీలు ఏకతాటిపైకి వచ్చి స్పష్టం చేసాయి.