
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎంతో మంది జీవితాలను చీకటిలోకి తోసేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవారు మాత్రమే కాకుండా విమానం కూలిన మెడికల్ కాలేజీ విద్యార్థులు 24 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
తాజాగా విమాన ప్రమాదంపై టాటా గ్రూపు సంస్థలు అధికారికంగా స్పందించాయి. ఈ సంఘటన తమ సంస్థలకు అత్యంత బాధాకరమైనదిగా పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలబడతామని గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఉద్యోగులకు రాసిన ఓ లేఖలో ఆయన, సంస్థ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రమాద ఘటనపై సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం సంస్థకే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి తీవ్రమైన మనోవేదన కలిగించే ఘటనగా నిలిచింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పూర్తిగా అండగా నిలుస్తామని టాటా గ్రూపు వెల్లడించింది.
విమానం ప్రమాదానికి గల కారణాలపై గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇందుకోసం బ్రిటన్, అమెరికా నుండి విచారణ బృందాలు ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దర్యాప్తునకు అవసరమైన అన్ని వివరాలను అందించేందుకు టాటా గ్రూపు పూర్తిగా సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
వాస్తవాలు వెలుగులోకి రావాల్సిందేనన్న ఉద్దేశంతో సంస్థ ముందుకు సాగుతోందని, దర్యాప్తులో తాము పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఊహాగానాలకు అతీతంగా వ్యవహరించాలని, ప్రజలు కొంత సహనం వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎయిరిండియా ప్రయాణికుల భద్రతపై సంస్థ ఎప్పుడూ రాజీ పడదని, సంస్థకు చెందిన ప్రతీ చర్య ప్రజల విశ్వాసానికి అద్దం పట్టేలా ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆ సంఘటన వల్ల ఏర్పడిన నష్టం తాము కూడా మరిచిపోలేమని, కానీ ఈ క్లిష్ట సమయంలో బాధ్యతలు వదలకుండా ముందుకు సాగుతామని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.