నిరసనలో మరణించిన రైతుల వివరాల్లేవు.. పరిహారమూ ఉండదు: పార్లమెంటులో కేంద్రం

By telugu team  |  First Published Dec 1, 2021, 12:38 PM IST

ఇప్పుడు పార్లమెంటులో రద్దయిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గతేడాది నవంబర్ నుంచి ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలో దాదాపు 700 మంది రైతులు మరణించారని రైతు సంఘాలు తెలిపాయి. ధర్నాలో మరణించిన రైతుల వివరాలు, వారికి అందించే పరిహారానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ప్రతిపక్ష అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని, కాబట్టి, వారికి పరిహారం అందించే అంశమే ఉత్పన్నం కాబోదని తెలిపింది.
 


న్యూఢిల్లీ: సాగు చట్టాల(Farm Laws) రద్దు(Repeal) వ్యవహారమై ఈ ఏడాది పార్లమెంటు(Parliament) శీతాకాల సమావేశాలపై దేశమంతా ఆసక్తిగా చూసింది. ఎట్టకేలకు తొలి రోజునే మూడు సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును ఉభయ సభలూ ఆమోదించాయి. అత్యంత వేగంగా చర్చకూ అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లుపై చర్చలో పంటకు కనీస మద్దతు ధరపై చర్చించాలనుకున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న ఘటన, సాగు చట్టాలపై ధర్నా చేస్తూ మరణించిన సుమారు 700 మంది రైతుల(Farmers)పైనా మాట్లాడాలని భావించామని, కానీ, కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, తాజాగా, మరో కీలక పరిణామం పార్లమెంటులో జరిగింది.

ఢిల్లీ సరిహద్దుల్లో మరణించిన రైతు ఆందోళనకారుల వివరాలు(No Records), వారికి పరిహారం(Compensation) అందించే ప్రణాళికల గురించి వివరించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశాయి. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వక సమాధానాన్ని లోక్‌సభకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అందుకు సంబంధించిన వివరాలు లేవని, కాబట్టి, వారికి పరిహారం అందించే ప్రశ్నే ఉదయించదని సమాధానం ఇచ్చారు.

Latest Videos

undefined

Also Read: సాగు చట్టాలు: మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. హిందీలో కేసీఆర్ ప్రకటన (వీడియో)

ఇప్పుడు పార్లమెంటులో రద్దయిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, టిక్రి, ఘాజీపూర్‌లలో ధర్నా చేస్తున్నారు. ఈ నిరసనలో సుమారు 700 మంది మరణించినట్టు రైతు సంఘాలు తెలిపాయి. ఇందులో ముఖ్యంగా కఠిన వాతావరణం, అనారోగ్యం, ఆత్మహత్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామన్న ప్రకటన చేసిన తర్వాత వెంటనే సంయుక్త కిసాన్ మోర్చా తమ డిమాండ్లను మరోసారి చర్చకు తెచ్చింది. పంటకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వం తమతో మాట్లాడాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, రైతులపై నమోదు చేసిన కేసులు అన్నింటినీ వెంటనే ఎత్తేయాలని, అలాగే, ఈ పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని స్పష్టం చేసింది. గతేడాది సెకండ్ వేవ్‌లోనూ ఆక్సిజన్‌తో మరణించిన వారి వివరాలు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానానికి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో పాల్గొనడానికి రైతు సంఘాల నుంచి ఐదుగురి పేర్లను కోరింది. కనీస మద్దతు ధరతోపాటు రైతులు చేస్తున్న ఇతర డిమాండ్లపైనా ఈ కమిటీ చర్చలు జరపనుంది.

Also Read: కేంద్రం పట్టించుకోకున్నా.. తెలంగాణ అండగా నిలుస్తున్నది.. 29న ‘పార్లమెంటు ఛలో’ : ఢిల్లీలో రైతు సంఘాలు

ప్రతిపక్షాలు కనీస మద్దతు ధరపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. రైతుల ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? అలాగైతే, వారి పంటకు కనీస మద్దతు ధరను అమలు చేస్తారా? అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నదని వివరించారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వం రబీ, ఖరీఫ్ సీజన్‌లలో 22 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు.

రైతులు ధర్నా ముగించుకుని ఇంటికి వెళ్లాలని, అందుకోసం వారితో క్రియాశీలకంగా, స్థిరంగా కేంద్ర ప్రభుత్వం అనుసంధానంలో ఉన్నదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు. ఇప్పటికే రైతులతో కేంద్ర ప్రభుత్వం 11 సార్లు చర్చలు నిర్వహించిందని తెలిపారు. వారి సమస్యను పరిష్కరించడానికే ఈ చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు.

click me!