ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన భారత్ కు పూర్తి మద్దతును ప్రకటించారు.
Pahalgam Terrorist Attack : భారతదేశంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. కాశ్మీర్ లో అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రమూకలు అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చిచంపిన ఘటన ప్రపంచాన్నే కలచివేసింది. ఇప్పటికే అన్నిదేశాలు ఈ దారుణంపై స్పందించగా తాజాగా ఇజ్రాయెల్ కూడా భారత్ కు మద్దతుగా నిలిచింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం తెలిపిన నెతన్యాహు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పహల్గాం ఉగ్రదాాడి గురించి ఇజ్రాయెల్ ప్రధానికి వివరించారు నరేంద్ర మోది.
PM of Israel called PM and strongly condemned the terror attack on Indian soil. He expressed solidarity with the people of India, and the families of the victims. PM Modi shared the barbaric nature of the cross border terrorist attack and reiterated…
— Randhir Jaiswal (@MEAIndia)
ఇదిలావుంటే బుధవారం ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా పహల్గాం ఉగ్రదాడిపై రియాక్ట్ అయ్యారు. అమాయకులపై ఉగ్రవాదులు జరిగిన దాడి పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో సాంకేతికత, నిఘా వంటి రంగాలలో ఇజ్రాయెల్ నిరంతర సహకారాన్ని ఇండియాకు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ దారుణ ఘటనలో ప్రశాంతమైన పర్యాటక ప్రదేశం విధ్వంసానికి గురైంది, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించగా పలువురు గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది.
ఈరోజు ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ నుండి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫోన్ వచ్చింది. ఈ సందర్భంగా ఫ్రెంచ్ నాయకత్వం భారత ప్రజలతో తమ సంఘీభావాన్ని తెలియజేసింది. కెనడియన్ నాయకులు కూడా దాడిని ఖండించారు. క్యూబెక్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్ లియో హౌసాకోస్, కెనడా సెనేట్ మాజీ స్పీకర్ ఈ దాడిని "విశ్వాసం, మానవత్వంపై అనాగరిక దాడి" అని పిలిచారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలని కోరారు.
దాడికి ప్రతిస్పందనగా, ప్రధాని అధ్యక్షతన భారతదేశం భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దోషులను, వారి మద్దతుదారులను జవాబుదారీగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అనేక ప్రతీకార చర్యలను ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేయడం, పాకిస్తాన్ SAARC వీసా మినహాయింపులను రద్దు చేయడం, రెండు దేశాల మిషన్లలో దౌత్య సిబ్బందిని తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి.