బంగాళాఖాతంలో అల్పపీడనం.. కేరళ సహా ప‌లు రాష్ట్రాల్లో వ‌ర్షాలు

By Mahesh RajamoniFirst Published Sep 10, 2022, 10:03 AM IST
Highlights

Heavy rains: త్రిసూర్ లో శుక్రవారం బలమైన గాలులకు అనేక చెట్లు, విద్యు. త్ స్తంభాలు నేలకొరిగాయి. పాతుకాడ్, మంజూర్ ప్రాంతాలలో చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయని జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. 
 

Heavy rains: దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. దీంతో వ‌ర‌ద‌లు సంభ‌వించి జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న కొద్ది రోజుల్లో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  అంచనా వేసింది. అల్పపీడనం తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ, కర్ణాటకలోని దక్షిణ అంతర్గత భాగం వరకు ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. త్రిసూర్, కోజికోడ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులు వీస్తాయని, ఇతర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

 త్రిసూర్ లో శుక్రవారం బలమైన గాలులకు అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పాతుకాడ్, మంజూర్ ప్రాంతాలలో చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయని జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. గత వారంలో (సెప్టెంబర్ 1 నుండి 7 వరకు) కేరళలో 59 శాతం ఎక్కువ వర్షం కురిసింది. ఈ కాలంలో సాధారణ వర్షం 71.6 మిమీ అయితే ఈసారి 113.8 మిమీ కురిసింది. భారీ వర్షపాతం ఉన్నప్పటికీ, అనేక జిల్లాలు ఇప్పటికీ వర్షాభావాన్ని కలిగి ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. వాటిలో పాలక్కాడ్ (30%), మలప్పురం (28), వ‌యనాడ్ (18%)లు ఉన్నాయి. అయితే, వ‌ర్షాకాలంలో ప్ర‌తిసారి కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు సంభ‌వించి పెను న‌ష్టాన్ని క‌లిగిస్తున్నాయి. గత నాలుగేళ్లలో వెనక్కి రుతుపవనాలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. 2018లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కార‌ణంగా 400 మందికి పైగా మరణించిన శతాబ్దపు అత్యంత ఘోర‌మైన‌ వరదలను చూసింది. 2020, 2021లో వయనాడ్, ఇడుక్కిలోని అనేక ప్రాంతాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలను బలిగొన్నాయి.

హైద‌రాబాద్ లోనూ.. 

శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి నగరంలో ట్రాఫిక్ మందగించి, గణేష్ నిమజ్జన వేడుకలు నిలిచిపోగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ జనజీవనం దెబ్బతినడంతో పాటు వివిధ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నగరం అకస్మాత్తుగా మేఘావృతమైన.. భారీ వర్షం ప్రారంభమైంది. నగరంలోని రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 86.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నాయక్‌లో 91.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

హైదరాబాద్ విషయానికొస్తే, రాబోయే 48 గంటలపాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంక‌లు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో చేరింది. జూరాలకు 2.09 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 75 వేల క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 49,503, శ్రీరాంసాగర్‌కు 39,850 క్యూసెక్కుల నీరు వస్తోంది.

click me!