మాజీ కేంద్ర సహాయ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ అయితే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తోంది..
తిరువనంతపురం: మోదీ 2.0లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజీవ్ ను పార్టీ జాతీయ నాయకత్వం ఇందుకోసం ఎంపిక చేసింది.
ప్రజా సమస్యలను అనునిత్యం పాటుపడే వ్యక్తిగా రాజీవ్ చంద్రశేఖర్ పేరు గాంచారు. గతంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. సాంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా, రాజీవ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఆరోపణలను వాక్చాతుర్యంతో పాటు నిజానిజాలను వెల్లడిస్తూ తిప్పి కొట్టడంలో రాజీవ్ ది అందె వేసిన చేయని చెప్పాలి. కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అధిస్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
గత లోక్ సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి రాజీవ్ అభ్యర్థిత్వం ఈ ప్రయోగంలో మొదటి దశగా పరిగణించారు. ఈ ఎన్నికలు యువ ఓటర్లు కొత్త తరం రాజకీయ నాయకుడికి అందగా నిలుస్తారని నిరూపించాయి. రాజీవ్ చంద్ర శేఖర్ తన విజన్ ను సాకారం చేయడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వంటి అంశాలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, నైపుణ్యాభివృద్ధి శాఖల కేంద్ర సహాయ మంత్రిగా పని చేసే సమయంలో రాజీవ్ కు బాగా ఉపయోగపడ్డాయి.
1964లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఫోర్స్ అధికారి ఎం.కె. చంద్రశేఖర్, వల్లి చంద్రశేఖర్ దంపతులకు జన్మించిన రాజీవ్ మొదట బెంగళూరు నుంచి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. కర్ణాటకలో ఆయనకు వృత్తిపరమైన మూలాలు ఉన్నప్పటికీ, ఆయన కుటుంబం కేరళలోని పాలక్కడ్ లోని కొండియూర్ కు చెందింది. వైర్ లెస్ టెలిఫోన్ లు ఇంకా అందుబాటులోకి రాని సమయంలో రాజీవ్ 1994లో బీపీఎల్ ద్వారా పేజర్లను, ఆ తర్వాత మొబైల్ సేవలను ప్రారంభించి, భారతదేశ సాంకేతిక విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 2005లో ఆయన జూపిటర్ క్యాపిటల్ ను స్థాపించి తన వ్యాపారాలను మరింత విస్తరించారు.
2005లో జూపిటర్ క్యాపిటల్ సంస్థను నెలకొల్పారు. 2006 చివరిలో రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏషియానెట్ కమ్యూనికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు. దీంతో రాజీవ్ మీడియా రంగంలోకి కూడా ప్రవేశించారు. ప్రస్తుతం ఏషియానెట్ న్యూస్ యజమాని అయిన రాజీవ్ చంద్రశేఖర్, అర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ హోల్డింగ్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టారు.
రాజీవ్ ప్రముఖ వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారడం చాలా వేగంగా జరిగింది. ఆయన 2006లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రవేశించి మూడుసార్లు వరుసగా ఎన్నికయ్యారు. 2021లో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన కేరళ ఎన్డీఏ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సంఘ్ పరివార్ నేపథ్యం లేని తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కావడం విశేషం.. ఆయన నియామకం చీలిపోయిన కేరళ బీజేపీకి కొత్త ఊపిరి పోస్తుందని కేంద్ర నాయకత్వం ఆశిస్తోంది. మరి కేరళలో బీజేపీ బలోపేతానికి రాజీవ్ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో చూడాలి.