Smart Electricity Meter Procurement Scam: కర్ణాటక ప్రభుత్వ విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందా? స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ₹7,500 కోట్ల స్కాం జరిగిందా అవుననే అనిపిస్తోంది. సదరు టెండర్‌ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు కృత్రిమంగా పెంచారని తెలుస్తోంది. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలలపై ఏసియానెట్ న్యూస్ Exclusive Report ఇది
కర్ణాటక ప్రభుత్వ విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందా? ఏషియానేట్ సువర్ణ న్యూస్‌కు లభించిన ప్రత్యేక సమాచారం ప్రకారం, స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ₹7,500 కోట్ల స్కాం జరిగిందని ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తోంది. సదరు టెండర్‌ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు కృత్రిమంగా పెంచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు శాసనసభ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే సి.ఎన్. అశ్వత్ నారాయణ ఈ అంశాన్ని లేవనెత్తారు. మొత్తం 39 లక్షల స్మార్ట్ మీటర్ల కొనుగోలులో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్మార్ట్ మీటర్‌ను తాత్కాలిక కనెక్షన్‌లకు మాత్రమే తప్పనిసరి చేయాలి. కానీ, బెస్కాం కొత్త కనెక్షన్లకూ బలవంతంగా అమలు చేస్తోందని అన్నారు. కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల్లోనూ స్మార్ట్ మీటర్లు పూర్తిగా అమలైన తరువాత మాత్రమే కొత్త కనెక్షన్లకు తప్పనిసరిగా చేయాలని ఉంది. అయినా రాష్ట్రంలో వీటిని బలవంతంగా అమలు చేయడం అనుమానాస్పదమని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో స్మార్ట్ మీటర్ ధరలు భారీగా పెరిగాయి. ఏషియానేట్ న్యూస్‌కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం,
సింగిల్ ఫేజ్ మీటర్ ధర ₹950 నుంచి ₹4,998కి పెరిగింది.
మరో రకమైన సింగిల్ ఫేజ్ మీటర్ ధర ₹2,400 నుంచి ₹9,000కి పెరిగింది.
త్రిఫేజ్ మీటర్ ధర ₹2,500 నుంచి ₹28,000కి పెరిగింది.
ఇది సగటు వినియోగదారులపై భారాన్ని పెంచేలా ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి స్మార్ట్ మీటర్‌కు ₹900 సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ మొత్తాన్ని నేరుగా టెండర్ కంపెనీలకు మంజూరు చేసి, ప్రజలపై భారం తగ్గించగా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం మొత్తం డబ్బును టెండర్ సంస్థలకు చెల్లించడంతోపాటు వినియోగదారుల నుంచి కూడా అధిక వసూళ్లు చేపట్టింది. దీంతో ఒక్కో మీటర్‌పై ₹9,260 అదనంగా ఖర్చు అవుతోందని ఏషియానేట్ ప్రత్యేక నివేదిక వెల్లడించింది.
బెస్కాం, మెస్కాం, హెస్కాం, జెస్కాం, సెస్కాం కలిసి మొత్తం 8 లక్షల స్మార్ట్ మీటర్ల కోసం ₹7,408 కోట్ల అదనపు వ్యయం అయింది. ఈ భారీ మొత్తాన్ని ఎవరికి లాభంగా మళ్లించారు? ఏ కారణంతో స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారు? టెండర్‌లో జరిగిన గోల్‌మాల్‌కు ఎవరు బాధ్యత వహించాలి? ప్రతిపక్షం ఈ ప్రశ్నలు సంధిస్తూ హౌస్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ ఆరోపణలపై విద్యుత్ శాఖ మంత్రి కే.జె. జార్జ్ స్పందించారు. బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీకి నిజంగానే టెండర్ ఇచ్చారా? స్మార్ట్ మీటర్ల ఖర్చు అనవసరంగా పెరిగిందా? అనే అంశాలను సమీక్షించి, అవసరమైతే టెండర్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ వివాదం మరింత ముదరుతుందా? ప్రభుత్వం నిజంగానే చర్యలు తీసుకుంటుందా? లేక ఇది రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతుందా? వేచిచూడాల్సిందే..!