మీరు నన్ను ఇక్కడ అంతం చేసినా.. మూవీ మాఫియాపై కంగనా

By telugu news teamFirst Published Sep 8, 2020, 10:16 AM IST
Highlights

ఇటీవల  ఆమె కార్యాలయంపై బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు దాడులు జరిపారు. తన కార్యాలయం గురించి బీఎంసీకి సమాచారం ఎప్పుడో ఇచ్చానని, అయినా తన కార్యాలయంపై దాడులు జరిపారని కంగనా తెలిపింది. 

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగ‌నా ర‌నౌత్‌  సెల‌బ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల తన ట్విటర్‌ ఖాతాను కొందరు సస్పెండ్‌ చేస్తున్నారని, మూవీ మాఫియా కుట్రతోనే ఇదంతా జరుగుతుందని కంగనా ఆరోపిస్తుంది.

కాగా.. ఇటీవల  ఆమె కార్యాలయంపై బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు దాడులు జరిపారు. తన కార్యాలయం గురించి బీఎంసీకి సమాచారం ఎప్పుడో ఇచ్చానని, అయినా తన కార్యాలయంపై దాడులు జరిపారని కంగనా తెలిపింది. 

ఈ క్రమంలో కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కారుపై ఘాటుగా స్పందించారు. ‘నా కార్యాలయంలోకి బీఎంసీ అధికారులు బలవంతంగా చొరబడ్డారు. అంతా కొలిచి చూశారు. నా ఆఫీసు పొరుగున ఉన్నవారిని కూడా వేధించారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని వారిని బెదిరించారు' అని కంగన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కాగా..తనపై ఈ కుట్ర అంతా మూవీ మాఫియానే చేయిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మూవీ మాఫియా ఇక్కడ తొక్కేయాలని చూసినా.. తాను వేరే ప్రాంతంలో మళ్లీ ఎదగగలనంటూ కంగనా తాజాగా పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల కంగనా ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చి మాట్లాడారు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నెల 9న తాను ముంబై వస్తున్నానని.. దమ్ము, ధైర్యం ఉంటే అడ్డుకోవాలని సవాల్ విసిరింది కంగనా. ఈ క్రమంలో ఆమె పర్యటన హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. కంగనాకి భద్రత కల్పించాలని ఆమె సోదరి, తండ్రి తన వద్దకు వచ్చినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు. 

అలానే కంగనా సెక్యూరిటీ విషయమై కేంద్రహోంశాఖా కూడా అప్రమత్తమైనట్లు తెలిసింది. ఆమెకి వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు సమాచారం. ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని కేంద్రహోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కంగనా సెక్యూరిటీ సిబ్బందిలో కమాండోలు కూడా ఉంటారని సమాచారం. 

click me!