ఎంత విచిత్రం... అక్కడ లక్షల ఏళ్లు వర్షమే వర్షం... ఇక్కడ వర్షపుచుక్క లేదు...! 

By Arun Kumar PFirst Published Apr 30, 2024, 3:05 PM IST
Highlights

ఈ భూమి ఎన్నో వింతలు విశేషాలను కలిగివుంది. ఇలా మంచుతో కప్పబడివుండే ఓ ప్రాంతంలో లక్షల ఏళ్లుకు వర్షపు చుక్క కురవకుంటే... లక్షల ఏళ్లపాటు వర్షం కురిసిన చరిత్ర కూడా వుంది...

కేవలం నాలుగు నెలల వర్షాకాలానికే మనం తీవ్ర ఇబ్బందులు పడతాం. రెండుమూడు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే 'ఇలా తగులుకుందేంట్రా బాబు' 'సూరీడు... ఎక్కడి వెళ్లిపోయావయ్యా' అంటూ మీమ్స్ మొదలవుతాయి. కానీ భూగ్రహం చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిరంతరాయంగా వర్షాలు కురిసాయట. వినడానికే ఎంత ఆశ్చర్యంగా వున్నా ఇది నిజంగానే జరిగినట్లు శాస్త్రవేత్తల పరిశోదనల్లో తేలింది. 

నీరు మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైనది. సముద్రపై నీటిని ప్రకృతే శుద్దిచేసి వర్షం రూపంలో మనకు అందిస్తుంటుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలయ్యింది కాదు... లక్షల ఏళ్ల క్రితమే మొదలయ్యిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23 లక్షల ఏళ్ల కింద కూడా విపరీతమైన వర్షాలు కురిసాయని... 20 లక్షల ఏళ్ళపాటు విరామం లేకుండా వర్షాలు కురిసాయట. అయితే ఈ సమయంలో భూమ్మీద మానవ మనుగడ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

లక్షల సంవత్సరాల క్రితం ఇప్పటి మాదిరిగా భూమి ఖండాలుగా విభజించబడలేదు. భూమి మొత్తం ఓవైపు... సముద్రం మొత్తం మరోవైపు వుండేది. అయితే వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడి కారణంగా సముద్రపు నీరు ఆవిరై మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగి భూమ్మీద లక్షల ఏళ్లు వర్షాలు కురిసాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఇక గత 20 లక్షల ఏళ్లుగా అసలు వర్షపు చుక్క కురవని ప్రాంతం కూడా మన భూమిమీద వుంది. వర్షం కురవడంలేదంటే అదేదో ఎడారి ప్రాంతమేమో అనుకుంటే పొరబడినట్లే. నిత్యం నీరు గడ్డకట్టి వుండే మంచుకొండల్లో ఈ కరువు ప్రాంతం  వుంది. అంటార్కిటికా ఖండం ఉత్తరం వైపు కొన్ని పొడి ప్రాంతాలున్నాయి... వీటిని 'డ్రై వ్యాలీస్' అంటారు.  అక్కడ గత 20 లక్షల సంవత్సరాలుగా ఒక్క వర్షపు చుక్కగానీ, మంచు గానీ కురవలేదట. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగానే వర్షపాతం నమోదు కావడంలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

నిజానికి అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి వుంటుంది కాబట్టి గాల్లో తేమశాతం ఎక్కువగా వుంటుంది. కానీ 'డ్రై వ్యాలీస్' గా పిలిచే ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం వుండటానికి 'కాటబాటిక్ విండ్స్' కారణమట. చుట్టూ మంచుకొండల కారణంగా డ్రై వ్యాలీస్ వైపు ఏమాత్రం తేమలేని పొడిగాలులు వీస్తుంటాయి. గాల్లో తేమ లేకపోవవడంతో ఇక్కడ వర్షాలు కురవవని శాస్త్రవేత్తలు గుర్తించారు.


 

click me!