UP Elections 2022: ప్రియాంక గాంధీ ప్రచారంతో సమాజ్‌వాదీ పార్టీకి ఓట్లు?.. కాంగ్రెస్‌లో కలవరం అదేనా?

By Mahesh KFirst Published Jan 25, 2022, 4:18 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉన్నది. అయితే, ప్రియాంక గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ కూడా శాయశక్తుల పని చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాట అటుంచితే.. అది చేసే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలూ ఆ పార్టీకి కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2007లో రాహుల్ గాంధీ ప్రచారంతోనే దీన్ని పోలుస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ రగిల్చినా.. దాన్ని ఓట్లుగా మలుచుకునే నిర్మాణం కాంగ్రెస్‌కు లేదనేది విశ్లేషకుల మాట.
 

లక్నో: రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరగడం సర్వసాధారణం. చాలా సార్లు వాటిని అంచనా వేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎరుకలో లేకుండా పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం పక్కనపెడితే.. ఒక లక్ష్యం పెట్టుకుని పని చేసినా అది ప్రత్యర్థులకు కలిసి వచ్చే దుస్సహ సందర్భాలూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కాంగ్రెస్(Congress) ఎదుర్కొంటున్నది అదే. ఐదేళ్లు అధికారంలో ఉంటేనే ఎంతో కొంత ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడటం సర్వసాధారణం. ప్రతిపక్షాలు వీటిని తమ అస్త్రంగా మార్చుకుంటూ ఉంటాయి. బరిలో రెండు పక్షాలే ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతను సులువగా తమ ఖాతాలోకి మరల్చుకోవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అక్కడ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఆ పార్టీకి కాకుండా బీజేపీ(BJP)కి బలమైన పోటీ ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)కి కలిసి వచ్చేలా ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ప్రధానంగా బీజేపీ పాలనలో గాయపడిన, పీడన అనుభవించిన, విషాదాలను ఎదుర్కొన్నవారి వేదనలు వివరిస్తున్నారు. వంచితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు సంధిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారు. వెనుకబడిన తరగతులు, మహిళలు, వలస కార్మికులకు తన ప్రసంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను మరింత పెంచుతున్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ.. యోగి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేగలుగుతున్నది. కానీ, ఆ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలం అవుతుందని కొందరు విశ్లేషకుల వాదన. ఇందుకు వారు చెప్పే ప్రధాన కారణం.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యేకించి ఓటు బ్యాంకు లేదు. కాంగ్రెస్ కలిగిస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునే వ్యవస్థాగత నిర్మాణం కాంగ్రెస్ పార్టీకి లేదని వారు చెబుతున్నారు.

2007లోనూ ఇదే తరహా పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొన్నది. ఏనుగు డబ్బులు తింటున్నది అంటూ బీఎస్పీ అవినీతిమయంగా మారిందని రాహుల్ గాంధీ విపరీత ప్రచారం చేశారు. అప్పుడు బీఎస్పీపై గట్టిగా ప్రచారం చేసినా.. అది ఓట్ల పరంగా సమాజ్‌వాదీ పార్టీకే కలిసి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతున్నదంటే కూడా కొందరు నిపుణుల వాదనలు ఇలా ఉన్నాయి.

కాంగ్రెస్‌కు పార్టీ పరమైన క్యాడర్ బలంగా లేదు. కేవలం స్వాతంత్ర్య సమరాన్ని, లేదా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి గతించిన నేతల పేర్లపైనే ఓట్లు పొందుతున్నదన్న వాదనలు ఉన్నాయి. లేదా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పాలన వంటివే దానికి పడే ఓట్లను నిర్దారిస్తున్నాయి. ఇదంతా బీఎస్పీ రంగంలోకి దిగక ముందటి చిత్రం. ఆ తర్వాత బీఎస్పీ.. కాంగ్రెస్‌కు ఉన్న దళితుల ఓటు బేస్‌ను లాక్కున్నది. షాబానో కేసు, రామజన్మ భూమి ఆలయ తాళాలు తీసిన తర్వాత ముస్లింలూ కాంగ్రెస్ నుంచి ఎస్పీ వైపు మళ్లారు. మెల్లగా బ్రాహ్మణ బేస్ కూడా బీజేపీని ఎంచుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దళితులు, ముస్లింలు, బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు గతంలో బలమైన ఓటు బేస్‌గా ఉండేవారని వివరిస్తున్నారు. 

ఇప్పుడు వర్చువల్ క్యాంపెయినింగ్ చేపట్టే వరకు మార్పులు వచ్చాయి. ఇలాంటి తరుణంలో బలమైన క్యాడర్ లేనిది ఓట్లు గెలుచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ చేసే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో సమాజ్‌వాదీ పార్టీ లబ్ది పొందుతుందనేది పొలిటికల్ అనలిస్టుల మాట. అయితే, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ క్యాడర్ బలపడే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్‌లో అది పార్టీకి కచ్చితంగా కలిసి వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

click me!