స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించొద్దు : రాష్ట్రపతి, సీజేఐలకు మత సంస్థల లేఖలు

By Siva KodatiFirst Published Mar 29, 2023, 9:19 PM IST
Highlights

స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మత సంస్థలు రంగంలోకి దిగాయి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దంటూ రాష్ట్రపతి, సీజేఐలకు లేఖలు రాశాయి. 

స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతేకాదు.. దేశంలోని అనేక సంస్థలు దీనికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాయి. దీనిలో భాగంగా రాష్ట్రపతి నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు లేఖలు రాశాయి. లేఖలు జారీ చేసిన సంస్థలలో చిస్తీ మంజిల్ సూఫీ ఖాన్ఖా, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా పస్మాండ ముస్లిం మహజ్ అండ్ ది కమ్యూనియన్ ఆఫ్ చర్చిస్ ఇన్ ఇండియా ఉన్నాయి. 

భారతదేశం భిన్న మతాలు, విశ్వాసాలు, ప్రాచీన సంస్కృతి ఉన్న దేశమని ఆల్ ఇండియా పస్మాండ ముస్లిం మహజ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఇందులో స్త్రీ, పురుషులు కుటుంబ నిర్మాణంలో భాగమని వివరించారు. అందువల్ల, స్వలింగ వివాహాలను గుర్తించడం వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ సంస్థ తన లేఖలో పేర్కొంది. వివాహం అంటే లైంగిక ఆనందాన్ని పొందడం మాత్రమే కాదు, సామాజిక నిర్మాణంతోనూ ముడిపడి ఉంటుందని ప్రస్తావించింది. స్వలింగ సంపర్కం భారతీయ ప్రజల మతం, సంస్కృతి, మనోభావాలకు విరుద్ధమని ఆ సంస్థ నిర్వాహకులు లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఆల్ ఇండియా పస్మాండ ముస్లిం మహజ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విని మనమందరం ఆశ్చర్యపోయామని కమ్యూనియన్ ఆఫ్ చర్చిస్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతికి లేఖ రాసింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం.. ప్రతి వ్యక్తి జన్మిస్తాడు వారికి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితిలో, స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించడం సరికాదని పేర్కొంది. తాము స్వలింగ సంపర్క వివాహాన్ని అంగీకరించబోమని..  మీరు దీన్ని ఆమోదించవద్దని ఆ సంస్థ లేఖలో ప్రస్తావించింది. మరోవైపు, చిస్తీ మంజిల్ సూఫీ ఖాన్ఖాకు చెందిన హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కొంతమంది దీనితో సంతోషిస్తారని.. కానీ చాలా మంది భారతీయులు దీనిని ఎప్పటికీ అంగీకరించరని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని హాజీ సయ్యద్ సల్మాన్ సీజేఐని కోరారు. 

ఈ వ్యవహారంపై ఈ అంశంపై గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశంలోని ప్రజల మానవ హక్కులతో పాటు మత విశ్వాసాలను నాశనం చేయబోతోందని హెచ్చరించింది. ఇస్లాం .. వివాహాన్ని గుర్తిస్తుందని, అయితే అది పురుషుడు, స్త్రీ మధ్యే జరగాలని ఆ సంస్థ జారీ చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. స్వలింగ వివాహం ఏ సందర్భంలోనైనా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అందువల్ల దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించకూడదని సూచించింది. 

click me!