‘75ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కులం’.. సుప్రీంకోర్టులో అంబేద్కర్ ప్రస్తావన

By telugu teamFirst Published Nov 28, 2021, 8:47 PM IST
Highlights

కులాంతర వివాహం చేసుకున్న ఓ జంటను చంపేసిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఈ ఘటన దేశంలో ఇంకా కులం సమసిపోలేదని స్పష్టం చేస్తున్నదని తెలిపింది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక పద్ధతి అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావించారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ప్రతి వర్గానికి న్యాయం, సమాన ఫలాలు అందాలనేదే ఆయన ఆశయమని, ఇది రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది.
 

న్యూఢిల్లీ: కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హతమార్చిన కేసుకు సంబంధించిన విచారణ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కులం(Caste) అడ్డు గోడలను దాటారని ఇద్దరు యువకులు, ఒక యువతిని 12 గంటల పాటు దారుణంగా భౌతిక దాడి చేశారని, ఆ ఘటనలో ఆ ముగ్గురూ మరణించారని సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు వివరాలను ప్రస్తావించింది. ఈ ఘటన కుల ప్రేరేపితమైనదని పేర్కొంది. అంటే భారత దేశానికి స్వాతంత్ర్యం(Independence) వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ కులం ఇంకా సమసిపోలేదని(Annihilation) స్పష్టం అవుతున్నదని వివరించింది. ఇదే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను(BR Ambedkar) ప్రస్తావించింది. 

కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక మార్గం అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. సమాజంలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం అందాలనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపిస్తాయని వివరించింది. అంతేకాదు, కేసులో నిందితులకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చే సాక్షుల భద్రతను ప్రభుత్వాలు గాలికి వదిలి పెడుతున్నాయని, తద్వారా పలుకుబడి, రాజకీయ ప్రాబల్యం కలిగిన నిందితుల కేసులో న్యాయం అందడం లేదని తెలిపింది. న్యాయమూర్తి ఎల్ నాగేశ్వరరావు సారథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read: దళిత బాలుడు గుడిలో అడుగుపెట్టాడని అగ్రవర్ణాల ఆగ్రహం.. ఆ కుటుంబానికి రూ. 23వేల జరిమానా

1991లో ఉత్తరప్రదేశ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు ఈ కేసులో 35 మందిని దోషులుగా నిర్ధారించింది. కాగా ఈ కేసు హైకోర్టుకూ చేరింది. ఈ కేసులో నుంచి ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించి మిగతా వారి విషయంలో ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే, ఈ కేసులో ఉరిశిక్ష విధించిన ఎనిమిది మంది నిందితులకూ శిక్షను తగ్గించింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా సవరించింది. ఆ తర్వాత ఇదే కేసు సుప్రీంకోర్టు వరకూ వచ్చింది.

1991 నాటి కేసులో దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వీటితోపాటు అధికారులకు కీలక ఆదేశాలను చేసింది. వీటిని సకాలంలో సరైన విధంగా అమలు చేయాలని ఆదేశించింది. విచారణే సరిగ్గా జరగకుండా చేస్తే సత్యం అనేది బాధితురాలిగా మిగిలిపోతుందని పేర్కొంది. కాబట్టి, ప్రతి కేసులోనూ విచారణ సక్రమంగా జరిగే చూడటం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పిస్తున్న జీవించే హక్కులోనే సురక్షిత, నేరరహిత సమాజంలో జీవించాల్సిన హక్కులూ పౌరులకు ఉంటాయని వివరించింది. కాబట్టి, ఈ కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలని తెలిపింది. 

Also Read: కుల దురహంకారం.. దళిత ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్న పెద్ద మనిషి

ఒకవేళ నిందితుడికి రాజకీయ పలుకుబడి ఉంటే, ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన హోదా ఉంటే అటువంటి కేసులో బాధితులకు న్యాయం జరగడం సవాలుగా మారిందని ఈ సందర్భంగా తెలిపింది. ఎందుకుంటే అలాంటి నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయని, అలా సాక్ష్యం ఇచ్చిన వారికి బయట సరైన రక్షణ లేకపోవడమే అందుకు కారణమని పేర్కొంది. కాబట్టి, సాక్షులకు ప్రభుత్వాలు సరైన రక్షణ కల్పించాలని తెలిపింది.

click me!