
India Pakistan : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. దీంతో ఇరుదేశాల సరిహద్దులో గతంలో మాదిరిగా సాధారణ పరిస్థితులు నొలకొన్నాయి. దీంతో పంజాబ్ సరిహద్దులోని మూడు జాయింట్ చెక్ పోస్టుల్లో మంగళవారం సాయంత్రం నుండి బీటింగ్ రిట్రీట్ వేడుకలను పునఃప్రారంభిస్తున్నట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
ఆపరేషన్ సింధూర్ కారణంగా మే 9న అట్టారీ-వాఘా (అమృత్ సర్), హుస్సేనివాలా (పిరోజ్ పూర్), సాద్కీ (ఫజిల్కా) , జాయింట్ చెక్ పోస్టుల్లో బీటింగ్ రిట్రీట్ ను నిలిపివేసారు. జాతీయ జెండాను దించే వేడుక ఈరోజు (మే 20) సాయంత్రం 6 గంటలకు పునఃప్రారంభం అవుతుంది. అయితే ఇవాళ కేవలం ఆర్మీ సిబ్బంది, మీడియాకు మాత్రమే అనుమతి ఉంటుందని… బుధవారం నుంచి ఈ వేడుకను సాధారణ ప్రజలకు కూడా అనుమతిస్తామని తెలిపారు.
భారతదేశ సైనిక క్రమశిక్షణ, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించే ఈ రిట్రీట్ వేడుకను భారత్, పాకిస్తాన్ సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇటీవల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దీన్ని తాత్కాలికంగా నిలిపివేసారు. ఈ వేడుక పునఃప్రారంభంతో జెండా దించే కార్యక్రమం, సరిహద్దు గార్డుల కవాతు చూసేందుకు ప్రజలు తరలిరానున్నారు.
అత్యధిక సంఖ్యలో సందర్శకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ సరిహద్దులోని మూడు కీలక జాయింట్ చెక్ పోస్టుల్లో రోజువారీ రిట్రీట్ వేడుకను నిలిపివేశారు. అయితే,ఉద్రిక్తతలు క్రమంగా తగ్గడంతో, మూడు ప్రాంతాల్లో జెండా దించే వేడుకను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
అయితే ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం గతంలో మాదిరిగా జరగదని… జాతీయ జెండా అవనతం సమయంలో సరిహద్ద గేట్లు తెరవబోమని బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ఇరుదేశాల సైనికుల కరచాలనం కూడా ఉండదని తెలిపారు.