డ్రగ్స్ బానిసగా మారిన యువతి.. గొలుసులతో కట్టేసిన తల్లి

By telugu teamFirst Published Aug 29, 2019, 11:37 AM IST
Highlights

తన కూతురిని ఇప్పటి వరకు నాలుగైదు సార్లు.. డీ- అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేశానని చెప్పారు. వాళ్లు మూడు, నాలుగు రోజులు వైద్యం అందించి అనంతరం... అక్కడి నుంచి ఇంటికి పంపించేవారని చెప్పారు. డ్రగ్స్ కి బానిసగా మారిన వారు.. మూడు, నాలుగు రోజుల్లో ఎలా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

ఓ యువతి డ్రగ్స్ కి బానిసగా మారింది. ఎంత ప్రయత్నించినా.. ఆమె ఆ డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడటం లేదు.దీంతో చేసేది లేక ఆ యువతిని కన్నతల్లే.. గొలుసులతో కట్టేసింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమృత్ సర్ కి చెందిన ఓ యువతి డ్రగ్స్ కి విపరీతంగా బానిసగా మారింది. దీంతో ఆమెను ఎలా కాపాడుకోవాలో తెలీక ఆమె తల్లి ఇంట్లో గొలుసులతో కట్టేసింది. మంగళవారం అమృత్ సర్ ఎంపీ, కాంగ్రెస్ నేత గుజ్రీత్ సింగ్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ఈ విషయం తెలిసింది.

ఈ సందర్భంగా ఆయన బాధితురాలిని, ఆమె తల్లిని పరామర్శించారు.  యువతి డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడేలా ప్రభుత్వం సహాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళతానని... తప్పకుండా వారికి సహాయం చేస్తానని అన్నారు. 

అనంతరం బాధిత యువతి తల్లి మీడియాతో మాట్లాడారు. తన కూతురిని ఇప్పటి వరకు నాలుగైదు సార్లు.. డీ- అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేశానని చెప్పారు. వాళ్లు మూడు, నాలుగు రోజులు వైద్యం అందించి అనంతరం... అక్కడి నుంచి ఇంటికి పంపించేవారని చెప్పారు. డ్రగ్స్ కి బానిసగా మారిన వారు.. మూడు, నాలుగు రోజుల్లో ఎలా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ బానిసలు వేలల్లో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా... రాష్ట్రం మొత్తంలో మహిళల కోసం కేవలం ఒకే డీ- అడిక్షన్ సెంటర్ ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తంలో ఒక్కటే ఉంటే ఎలా సరిపోతుందని ఆమె ప్రశ్నించారు. కాగా... దీనిపై కూడా ఎంపీ స్పందించారు.

బాధిత యువతికి ఇంటి వద్దనే ఉంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువతి పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా... పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు న్నర సంవత్సరాల కాలంలో పంజాబ్ లో దాదాపు 160మంది డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

click me!