అట్టుడుకుతున్న తుత్తూకుడి: ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్

First Published May 24, 2018, 12:19 PM IST
Highlights

తమిళనాడులోని తుత్తూకుడి ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉంది.

చెన్నై: తమిళనాడులోని తుత్తూకుడి ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించకూడదనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం తుత్తూకుడిలోనే కాకుండా పొరుగున ఉన్న తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. 

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ను, పోలీసు సూపరింటిండెంట్ పి. మహేంద్రన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ ను తుత్తూకుడి జిల్లా కలెక్టర్ గా నియమించింది. మహేంద్రన్ స్థానంలో నీలగిరి ఎస్పీ మురళీ రంభ ఎస్పీగా వచ్చారు. 

స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసు కాల్పుల్లో ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లు సమాచారం. ఓ వైపు తుత్తూకుడి అట్టుకుడుతుంటే మంత్రులు ఫంక్షన్స్ హాజరు కావడం విమర్శలకు దారి తీసింది.

కమల్ హాసన్, ఎండిఎంకె నేత వైగో, ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ తుత్తూకుడిని సందర్శించారు. తుత్తూకుడిలో ఇంటర్నెట్ సేవలను నిలిపేయడాన్ని కమల్ హాసన్ తప్పు పట్టారు. 

తుత్తూకుడి ఘటనకు నిరసనగా డిఎంకె నేత స్టాలిన్ సచివాలయం వద్ద రాస్తారోకకు దిగారు. కార్లను రోడ్డుపై పార్క్ చేసి డిఎంకె నేతలు ఆందోళనకు దిగారు. స్టాలిన్ తో పాటు శాసనసభప్యులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీనామా చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. 

click me!