నెలసరి దారి తప్పిందా..? కారణం ఏమైండొచ్చు?

By telugu teamFirst Published Aug 19, 2019, 3:34 PM IST
Highlights

హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం కావొచ్చు. అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవాకశం ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు.
 

నెలసరి ప్రతి నెలా వచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి ఎంత ఇబ్బంది పెట్టినా...  సమయానికి రాకపోతే మాత్రం కంగారుపడిపోతుంటాం. కంగారు పడాలి కూడా అంటున్నారు నిపుణులు. సాధారణంగా నెలసరి 28 నుంచి 30 రోజుల్లోపు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులు అటుఇటుగా వస్తుంది. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ... అలా కాకుండా 40 రోజులు దాటినా రాకుండా ఉండటం... లేదంటే మూడు వారాలకన్నా ముందే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్లు మాత్రం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం కావొచ్చు. అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవాకశం ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు.

బరువు విపరీతంగా పెరిగినా, తగ్గినా కూడా నెలసరి ఆలస్యం కావొచ్చు. చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు.. ఇలా కారణం ఏదైనా ఒత్తిడి కూడా కారణం కావొచ్చు. దాని ప్రభావంతో అమ్మాయిల్లో నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకుండా... విపరీతంగా డైట్ ఫాలో అయ్యేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది.

థైరాయిడ్ లోపాలు, ఎడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా నెలసరి క్రమం తప్పుతుంది. క్రోమోజోముల లోపాలు ఉన్న స్త్రీలకు అండాల నిల్వ ఉండదు. ఒక్కోసారి అండాశయాలు కూడా తయారు కావు. గర్భాశయం చిన్నగా ఉన్నవారికి కూడా నెలసరి సరిగా రాదు. కాబట్టి  సమస్య  ఏంటో తెలుసుకోని వైద్యులతో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

నెలసరి క్రమం తప్పకుండా రావాలి అంటే... బరువు మరీ పెరగకుండా.. మరీ తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. సమస్య పెద్దది కానప్పుడు కొన్ని నెలలపాటు హార్మోన్లను క్రమబద్ధీకరించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడితో సరిపోతుంది. 

click me!