నోట్ల రద్దు ఎఫెక్ట్: గరిష్ఠస్థాయికి నిరోద్యోగం.. ఇక ‘డబుల్ డిజిట్’చరిత్రే

By ramya N  |  First Published Mar 6, 2019, 3:38 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్పగా అవినీతిని అంతమొందించి నల్లధనాన్ని వెలికి తీసేందుకు.. ఉగ్రవాదం ఆట కట్టించేందుకు పెద్ద నోట్ల రద్దు అమలు చేస్తున్నామన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ఆగమేఘాలపై జీఎస్టీ అమలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో నోట్ల రద్దు, జీఎస్టీ నిబంధనల వల్ల చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలు కుచించుకుపోయాయి. గత నెలలో నిరుద్యోగిత శాతం గరిష్ఠంగా 7.2 శాతానికి చేరుకున్నదని సీఎంఐఈ సంస్థ పేర్కొనడమే కారణం. 
 


భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగిత శాతం అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. నోట్ల రద్దు, తర్వాత ఆగమేఘాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి తేవడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని, ఆ రంగాల్లో పని చేస్తున్న వారంతా ఉద్వాసనకు గురి కావాల్సి వచ్చిందని ఈ నివేదిక తేల్చింది.  

గతేడాది ఫిబ్రవరిలో 5.9 శాతానికే
అయితే గతేడాది ఫిబ్రవరిలో నిరుద్యోగిత 5.9 శాతంగా ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదికను పేర్కొంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలను ఈ నివేదిక బయటపెట్టింది. 

Latest Videos

undefined

ఉద్యోగార్థులు తగ్గినా పెరిగిన నిరుద్యోగం రేట
వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే మేరకు నిర్ధారించిన అంశాల ఆధారంగా సీఎంఐఈ నివేదికను వెల్లడించింది. ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినా.. నిరుద్యోగ రేటు పెరిగిందని ముంబైకి చెందిన ఓ సంస్థకు హెడ్‌ అయిన మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. 

60 లక్షలు తగ్గిన ఉద్యోగాలు
ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. గతేడాది ఉద్యోగాలు చేస్తున్న వారు 406 మిలియన్ల మంది అని సర్వేలో తేలింది.

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోనే నిరుద్యోగం రైజ్
పెద్దనోట్ల రద్దు, ఆగమేఘాలపై అమలు చేసిన జీఎస్టీ వల్ల 2018లో దాదాపు 1.10కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. కానీ నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది.

సర్కార్ ఇబ్బందికరంగా గణాంకాలు
ఈ గణాంకాలు త్వరలో ఎన్నికలకు సిద్ధం కానున్న ప్రధాని నరేంద్రమోదీకి నిరాశ కలిగించేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తక్కువ ఉద్యోగాలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలు విపక్షాలకు అస్త్రాలు కానున్నాయి. 

గ్రామాల్లో 85 శాతం మందికి నిరుద్యోగం
గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం మంది నిరుద్యోగంతో బాధ పడుతున్నారు. ఇటీవల దేశంలో నిరుద్యోగిత 45 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ)ను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కానీ అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని కేంద్రం సమర్థించుకున్నది. 

రెండంకెల వేతన వృద్ధి గత వైభవమే
ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురు కానున్నదని ఏఆన్ హెవిట్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవమే’నని ఆ సర్వే పేర్కొంది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతమని హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్‌ అంచనా వేసింది.

ఈ ఏడాది స్వల్పంగానే వేతన వృద్ధి 
2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతోందని ఏఆన్‌ హెవిట్‌ డేటా తెలిపింది.

2020లో వేతన వృద్ధిని అంచనా వేసినా 
ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవమేనని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ హెడ్‌, భాగస్వామి అనందర్ప్‌ ఘోష్‌ స్పష్టం చేశారు.

నిపుణులకే వేతన వృద్ధి అవకాశాలు
కీలక నైపుణ్యాలు కల వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్‌నెట్‌ కంపెనీలు, ప్రొఫెషనల్‌ సేవలు, లైఫ్‌ సైన్సెస్‌, ఆటోమోటివ్‌, కన్జూమర్‌ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.
 

click me!