Taliban: తాలిబాన్లు నిజంగానే హెలికాప్టర్ ద్వారా వేలాడదీశారా? నిజమేంటంటే..!

By telugu teamFirst Published Sep 1, 2021, 7:00 PM IST
Highlights

తాలిబాన్లు ఓ వ్యక్తిని అమెరికన్ యుద్ధ హెలికాప్టర్ బ్లాక్ హాక్‌కు వేలాడదీసి అతిక్రూరంగా చంపారని, అందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేస్తూ కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు పోస్ట్ చేశారు. కానీ, ఈ వాదనలు అబద్ధాలని, సదరు వ్యక్తి బతికే ఉన్నాడని, ఆ తాడు ఆయన మెడకు కాకుండా చాతికి కట్టినట్టు చూపిస్తున్న మరో వీడియోను పోస్టు చేసి ఫ్యాక్ట్ చెక్ న్యూస్ సైట్లు పేర్కొన్నాయి. స్థానిక ప్రభుత్వ భవనంపై తాలిబాన్ల జెండా ఎగరేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆ వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్టులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: అమెరికా బలగాలు అలా వెళ్లగానే ఇలా తాలిబాన్లు అరాచకాలు ప్రారంభించారని, ఓ వ్యక్తిని హతమార్చి హెలికాప్టర్ ద్వారా వేలాడదీశారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. మీడియా సంస్థలు సహా పేరున్న జర్నలిస్టులూ తమ ట్విట్టర్ ఖాతాల్లో ఆ వీడియోను పోస్టు చేసి తాలిబాన్ల అరాచకాలు ఆరంభమని పేర్కొన్నారు. భారత న్యూస్ మీడియా సంస్థలు సహా విదేశీ మీడియా వరకూ ఇదే వార్త హాట్ హాట్‌గా మారింది. కానీ, నిజానిజాలు ఈ వాదనలకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నది. తాలిబాన్ల అరాచకాలు పక్కనపెడితే ఆ వీడియోలో కనిపిస్తున్నది మాత్రం బయట ప్రచారంలో ఉన్నదైతే కాదని అవగతమవుతున్నది.

నిజంగానే ఆ వ్యక్తిని ఉరేసి హెలికాప్టర్‌కు వేలాడదీశారా? అనే చర్చ ఊపందుకున్న తర్వాత వీడియో కచ్చితత్వంపై అనుమానాలు వెలువడ్డాయి. అదే ఘటనను క్లోజ్‌గా చూపిస్తున్న మరో వీడియో ఆ వ్యక్తిని చంపేయలేదని, ఉరి అసలే వేయలేదని వెల్లడిస్తున్నది. నిజానికి ఆ తాడు ఆయన మెడకు కాకుండా చాతి చుట్టూ వేసినట్టు కనిపిస్తున్నది. ఇంకొన్ని చిత్రాలు, వీడియోల్లో ఆ వ్యక్తి బతికే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన చేతులు కదులుతూ కనిపించాయి. వాటి ద్వారా ఒక చోట నుంచి మరో చోటకి అతన్ని తరలిస్తున్నట్టుగానే అర్థమవుతున్నది.

తాలిబాన్లు ఆ వ్యక్తిని ఉరేసి హెలికాప్టర్ ద్వారా వేలాడదీశారన్న వార్త వైరల్ అయిన తర్వాత చాలా న్యూస్ ఔట్‌లెట్లు, ఫ్యాక్ట్ చెకర్‌లు ఆ వార్తలను కొట్టిపారేశాయి. ఓ ప్రభుత్వ భవనంపై జెండాను ఎగరేసే పనిలో భాగంగా వ్యక్తిని అలా హెలికాప్టర్‌తో తరలించినట్టు రిపోర్ట్ చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన జర్నలిస్టుల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తాలిబాన్ సభ్యుడే. ఓ ప్రభుత్వ భవనంపై తాలిబాన్ జెండాను ఎగరేయడానికి ఆ హెలికాప్టర్ ద్వారా ప్రయత్నించాడు. కానీ, చివరకు విఫలమై వెనుదిరిగాడు.

కానీ, ఆ మనిషి చనిపోయినట్టు పేర్కొంటూ సోమవారం, మంగళవారం సోషల్ మీడియాలో తప్పుడు వాదన వైరల్ అయింది. జీ5, ఆజ్ తక్, నవభారత్ టైమ్స్, దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా, ఎన్‌డీటీవీ, జీ హిందుస్తాన్, ఇండియా టీవీ, ఏఎన్ఐ, ఎంఎస్ఎన్ ఇండియా, జీ న్యూస్, రిపబ్లిక్, ఏబీపీ న్యూస్, ఓప్ఇండియా సహ పలు సంస్థలు ఇదే తప్పుడు వానదను ఆధారం చేసుకుని స్టోరీలు ప్రచురించాయి. అంతేకాదు, న్యూయార్క్ పోస్టులాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కొన్ని ఇదే వాదనలతో కథనాలు ప్రచురించగా కొందరు అమెరికన్ పొలిటీషియన్లూ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

click me!