Coronavirus: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ విజృంభణను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా యూరప్ ను ఒమిక్రాన్ ఉప్పెన ముంచెత్తనుందని హెచ్చరించింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సగం యూరప్‌ను ఒమిక్రాన్ ఆక్రమిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొన్ని దేశాల్లో అయితే, అత్యంత ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా యూరప్ దేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఇదివరకు రికార్డులను బ్రేక్ చేస్తూ రోజువరీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ పరిస్థితులు మరింతగా దిగజారిపోయే ప్రమాదముందనీ, దీనికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ విజృంభణను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా యూరప్ ను ఒమిక్రాన్ ఉప్పెన ముంచెత్తనుందని హెచ్చరించింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సగం యూరప్‌ను ఒమిక్రాన్ ఆక్రమిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. యూరప్ పశ్చమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందనీ, దీని కారణంగా యూరప్ ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ ఏడాది (2022) మొదటి వారంలో 70 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డ గణాంకాలను ఆధారంగా చేసుకుని తాము ఈ అంచనాకు వచ్చమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
undefined
యూరోపియన్ దేశాల్లో కరోనా వైరస్ విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగ్ మాట్లాడుతూ.. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఐరోపా జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ వ్యాధి బారిన పడవచ్చని తెలిపారు. 2022 మొదటి వారంలో యూరోపియన్ ప్రాంతంలో ఏడు మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు వెలుగుచూశాయి. జనవరి 10 నాటికి, ఐరోపాలోని 26 దేశాలు ప్రతి వారం తమ జనాభాలో 1 శాతానికి పైగా కోవిడ్-19 బారిన పడ్డాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నాయని తెలిపారు. ఒమిక్రాన్ సునామీ కారణంగా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు. "ఇది అనేక దేశాలలో ఆరోగ్య వ్యవస్థలు, సేవల పంపిణీని సవాలు చేస్తోంది, ఇక్కడ Omicron వేగంతో వ్యాపించింది. మున్ముందు మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది" అని డాక్టర్ క్లూగే చెప్పారు.
అలాగే, ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా టీకాలు మంచి రక్షణను అందిస్తూనే ఉన్నాయని ఆయన తెలిపారు. "ప్రస్తుతం ఆమోదించబడిన వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌తో సహా తీవ్రమైన వ్యాధి, మరణాల నుండి మంచి రక్షణను అందించడాన్ని కొనసాగిస్తున్నాయని" పునరుద్ఘాటించారు. Omicron ఉప్పెనను ఎదుర్కొంటున్న దేశాలు.. ప్రభావం అధికంగా ఉండే సమూహాలను ఆరోగ్య సేవల అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. “సిఫార్సు చేయబడిన క్వారంటైన్ లేదా ఐసోలేషన్ పీరియడ్‌లను తగ్గించే ఏ నిర్ణయమైనా ప్రతికూల కోవిడ్-19 పరీక్షలతో కలిపి తీసుకోవాలి. క్లిష్టమైన సేవాల కొనసాగింపును కాపాడుకోవడానికి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. అలా చేయడం వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి” అని అన్నారు.
కాగా, ఇదివరకు Omicron మునుపటి కరోనా వేరియంట్ డెల్టా కంటే తక్కువ తీవ్రతతో ఉందని WHO చెప్పింది. అయితే, ఈ ఒమిక్రాన్ గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదనీ, ఇది తేలికపాటిది కాదనీ, WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జనవరి 7న అన్నారు. డెల్టా వేరియంట్ లాగే ఒమిక్రాన్ విజృంభించి ప్రజల ప్రాణాలు తీసుకోవడంతో పాటు అనేక మందిని ఆస్పత్రి పాలు చేస్తుందని హెచ్చరించారు.