ఐక్యరాజ్య సమితికి ఉత్తర కొరియా వార్నింగ్.. ‘బాలిస్టిక్ క్షిపణి’ చర్చపై ఫైర్

By telugu teamFirst Published Oct 3, 2021, 7:06 PM IST
Highlights

ఉత్తర కొరియా మరోసారి దుస్సహ వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. గతంలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఈ దేశం తాజాగా ఐక్యరాజ్య సమితినే హెచ్చరించింది. తమ దేశం నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై ఆంక్షలు విధించే ఆలోచనలు మానుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని హరించాలని చూస్తే తదుపరి పరిణామాలనూ ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సారథ్యంలోని ఉత్తర కొరియా(North Korea) ప్రభుత్వం ఏ ప్రకటన చేసినా ప్రపంచదృష్టిని ఆకర్షించుకుంటుంది. ఇప్పటి వరకు దాని దుస్సహ వైఖరితోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా(US)కు వార్నింగ్ ఇవ్వడానికే ఎంతమాత్రం సంకోచించని దేశం అది. తాజాగా, అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి(UN)నే లక్ష్యంగా చేసుకుంది. ఐరాసకూ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే ఉత్తర కొరియా నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి(Missile) పరీక్షలపై పాశ్చాత్య దేశాలు కన్నెర్ర జేశాయి. వెంటనే ఆంక్షలు అమలు చేయాలని భావించాయి. దీనిపై శుక్రవారం ఐరాస భద్రతా మండలి రహస్యంగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.  నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేసే ఓ ప్రకటనను భేటీ అనంతరం ఫ్రాన్స్ విడుదల చేసింది. బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను పూర్తిగా నిషేధించే ఐరాస తీర్మానాన్ని ఉత్తర కొరియాపై సంపూర్ణంగా అమలు చేయాలని ఆ ప్రకటన పిలుపునిస్తున్నది. దీనిపై ఉత్తర కొరియా ఫైర్ అయింది.

ఈ ప్రకటన తర్వాత ఉత్తర కొరియా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి జో చొల్ సు స్పందించారు. ఉత్తర కొరియా సార్వభౌమత్వంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తర్వాతి పరిణామాలనూ కచ్చితంగా ఆలోచించుకోవాలని ఐక్యరాజ్య సమితిని హెచ్చరించారు. ఐరాస ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని ఆరోపించారు. అమెరికా, దాని మిత్రదేశాలు ఈ క్షిపణులనే పరీక్షిస్తే ఐరాస కిక్కురుమనదని విమర్శించారు.

సుమారు ఆరు నెలల తర్వాత ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్షలను సెప్టెంబర్‌లో మొదలుపెట్టింది. అణ్వాయుధాలనూ మోసుకెళ్లే సామర్థ్యంతో నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ క్షిపణులు అమెరికా మిత్రపక్షాలైన దక్షిణ కొరియా, జపాన్‌లను దాడి చేసే సామర్థ్యం గలవి.

ఉత్తర కొరియా ఇప్పటికీ దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలకు ఆహ్వానిస్తూనే ఉన్నది. ఈ చర్చల ద్వారా అమెరికాపై ఒత్తిడి తెచ్చి తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను సడలింపజేసుకోవాలనేది ఉత్తర కొరియా ఆలోచన. అమెరికానూ చేరే సామర్థ్యం గల లాంగ్ రేంజ్ క్షిపణుల పరీక్షలను స్వీయ నిబంధనలతోనే ఉత్తర కొరియా చేపట్టడం లేదు. తద్వారా భవిష్యత్‌లో అమెరికాతో సత్సంబంధాలు నెరపాలనీ చూస్తున్నది. అమెరికా మాత్రం ముందస్తు షరతులు లేకుండా ఉత్తర కొరియా చర్చలకు రావాలని కోరుతున్నా అందుకు కిమ్ ప్రభుత్వం ససేమిరా అంటున్నది.

click me!