Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. జాడే మైన్‌లో విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు

By Sumanth Kanukula  |  First Published Dec 22, 2021, 3:51 PM IST

మయన్మార్‌లోని (Myanmar) ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జాడే (పచ్చ రాళ్ల) మైనింగ్ సైట్‌ కొండచరియలు (jade mine landslide) విరగిపడటంతో ఒకరు మృతిచెందగా, 70 మంది గల్లంతయ్యారు.


మయన్మార్‌లోని (Myanmar) ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాడే (పచ్చ రాళ్ల) మైనింగ్ సైట్‌‌లో కొండచరియలు (jade mine landslide) విరగిపడటంతో ఒకరు మృతిచెందగా, 70 మంది గల్లంతయ్యారు. కాచిన్ రాష్ట్రంలోని (Kachin state) హ్పకాంత్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లైంతన వారి కోసం గాలింపు చేపట్టారు. 

లారీల నుంచి ఉపరితల గనుల్లో వేసిన శిథిలాలు ఓవర్‌ఫ్లో గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక, జాడే‌ గనులకు ప్రపంచంలో మయన్నామర్ ప్రసిద్ది చెందింది. కానీ ఇక్కడి గనులలో చాలా ఏళ్లుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

Latest Videos

undefined

ఈ క్రమంలోనే హ్పకాంత్‌ ప్రాంతంలో జాడే మైనింగ్‌పై నిషేధం విధించారు. అయితే సరైన ఉపాధి లేకపోవడా, కోవిడ్-19 పరిస్థితుల వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు తరుచూ నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే మైనింగ్ చేసేవారికి సరైన నైపుణ్యం లేకపోవడం, కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారు. 

కాచిన్ రాష్ట్రంలో జాడే మైనింగ్ చేస్తున్న సమయంలో.. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృతిచెందారు. ఇక, 2020లో చోటుచేసుకున్న ప్రమాదంలో 160 మందికి పైగా మృతిచెందారు. వీరిలో ఎక్కువ మంది వలస వచ్చినవారే. ఇదిలా ఉంటే చిన్న చిన్న ప్రమాదాల్లో పదుల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. 

ఇక, అక్కడ 2018లో కొత్త రత్నాల మైనింగ్ చట్టం ఆమోదించబడింది. అయితే చట్టవిరుద్ధమైన పద్ధతులను ఆపడానికి అధికారులకు పరిమిత అధికారాలు మాత్రమే ఉండటం, వారి సంఖ్య కూడా తక్కువ ఉండటం వల్ల వాటిని అరికట్టడం కష్టంగా మారిందని విమర్శకులు అంటున్నారు. మయన్మార్ జాడే వ్యాపారం ఏడాది 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైనదని నివేదికలు చెబుతున్నాయి.  Hpakant ప్రపంచంలోనే అతిపెద్ద జాడే గని ప్రదేశం.

click me!