దోషికి కరోనా సోకడంతో నిలిచిన ఉరిశిక్ష.. సింగపూర్ కోర్టు సంచలన నిర్ణయం

By telugu teamFirst Published Nov 9, 2021, 4:05 PM IST
Highlights

డ్రగ్స్ కేసులో దొరికి దోషిగా తేలి ఉరి శిక్ష కోసం 11ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. చివరి అవకాశంగా మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఇంతలోనే ఆ భారత సంతతికి చెందిన మలేషియా పౌరుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. కామన్ సెన్స్, మానవత్వంతో ఆలోచించి పిటిషన్ పూర్తయ్యే వరకు ఉరి శిక్షపై స్టే విధిస్తున్నట్టు సింగపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 

న్యూఢిల్లీ: Singapore Court సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సంతతికి చెందిన ఓ Malaysia పౌరుడికి Covid-19 Positive అని తేలడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షపై స్టే ఇచ్చింది.

నాగేంద్రన్ కే ధర్మలింగం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు కోర్టు Death Sentence విధించింది. బుధవారం అంటే రేపు ఆయనకు చంగీ జైలులో ఉరి శిక్ష అమలు కావాల్సి ఉన్నది. కానీ, ఈ ఉరి శిక్ష పై సమీక్ష కోసం దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌నూ కోర్టు కొట్టేసింది. కానీ, కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేయడానికి నాగేంద్రన్ కే ధర్మలింగానికి కోర్టు అవకాశమిచ్చింది. కానీ, ఇంతలోనే ఆయనకు కరోనా పాజటివ్ అని తేలింది. వెంటనే ఆయనను కోర్టు ప్రాంగణం నుంచి తీసుకెళ్లారు.

Also Read: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం: 2025 వరకు కొంచెం కొంచెం తినండి.. ప్రజలకు కిమ్ ఆదేశాలు

ఈ పిటిషన్ విచారిస్తున్న న్యాయమూర్తుల్లో ఒకరైన ఆండ్రూ ఫాంగ్ దోషి నాగేంద్రన్ కే ధర్మలింగానికి కరోనా సోకడంపై మాట్లాడారు. ఇది ఊహించని పరిణామం అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విచారణ కొనసాగించడం సరికాదని కోర్టు భావిస్తున్నదని తెలిపారు. నిజానికి దోషి నాగేంద్రన్ కే ధర్మలింగానికి ఉరి శిక్ష రేపు అమలు కావాల్సి ఉన్నది. కానీ, ఇంతలోనే ఆయనకు కరోనా సోకిందని తెలిపారు. ఈ తరుణంలో ఆయనకు విధించిన ఉరి శిక్షను రేపు అమలు చేయవద్దని భావిస్తున్నట్టు వివరించారు. దోషికి కొవిడ్ సోకినట్టు తమకు ఇప్పుడే తెలిసిందని, ఈ పరిణామంపై సూచనలు, సలహాలు తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ఇక్కడ మనం తర్కం, కామన్ సెన్స్, మానవత్వంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం విచారణను వాయిదా వేశారు. ఎప్పటికి వాయిదా వేయాలనేదీ ఇంకా నిర్ణయించాల్సి ఉన్నది. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు ఉరి శిక్షపై స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Also Read: పోర్న్ సైట్‌లో మ్యాథ్స్ క్లాస్‌లు.. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్న టీచర్

42.72 గ్రాముల హెరాయిన్‌‌ను దేశంలోకి అక్రమంగా తరలిస్తుండగా 2009లో నాగేంద్రన్ కే ధర్మలింగం పట్టుబడ్డాడు. 2010లో ఈ కేసులో ఆయనకు ఉరి శిక్ష పడింది. 2011లో హైకోర్టులో, 2019లో సుప్రీం కోర్టులో తన వాదనల్లో ఓడిపోయారు. క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.

చివరి నిమిషంలో ఉరి శిక్షను మరోసారి రివ్యూ చేయాలని లాయర్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. డ్రగ్స్ తరలించేటప్పుడు నాగేంద్రన్ కే ధర్మలింగం మానసిక స్థితి సరిగా లేదనే విషయాన్ని విచారించాలని కోరారు. ఈ పిటిషన్‌నూ కోర్టు డిస్మిస్ చేసింది. కానీ, కోర్టు డిస్మిస్ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి నాగేంద్రన్ కే ధర్మలింగానికి అవకాశమిచ్చింది. ఈ రోజు ధర్మలింగం చివరి పిటిషన్‌పై విచారించనున్న నేపథ్యంలో కోర్టు హాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాతో కిక్కిరిసి పోయింది. కానీ, నాగేంద్రన్‌కు కరోనా పాజిటివ్ తేలడంతో అనూహ్య మలుపు తిరిగింది. అయితే, నాగేంద్రన్‌కు ఎప్పుడు కరోనా సోకిందనే విషయంపై సమాచారం లేదు.

నాగేంద్రన్ కేసుపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఆయనను విడుదల చేయాల్సిందిగా సంతకాల సేకరణ జరిగింది. ఇందులో కనీసం 70వేల మంది సంతకాలు పెట్టారు. మలేషియా ప్రధాని కూడా సింగర్ పూర్ ప్రధానికి ఈ కేసు విషయమై లేఖ రాశారు.

click me!