
మిలింద్ సోమన్ మంచి నటుడు. ఆయన ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలుసు. మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ కూడా.. 85 ఏళ్ల వయసులో తన ఫిట్ నెస్ అలవాట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చూడటానికి మామూలు గృహిణిలా కనిపిస్తున్న ఈ పెద్దావిడ.. ఈ వయసులోనూ ఎంత చురుకుగా ఉంటారో చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే... ఉషా సోమన్ తన ఫిట్ నెస్ అలవాట్ల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.
ఉషా సోమన్ 60 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించారు. 85 ఏళ్ల వయసులోనూ చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఫిట్ నెస్ కి వయసుతో సంబంధం లేదని ఆమె నిరూపిస్తున్నారు. ఫిట్‌నెస్ తో ఏ వయసులోనైనా ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఉషా చెబుతున్నారు.
యోగాను అలవాటుగా మార్చుకోండి
ఉషా సోమన్ ప్రతి రోజు సాయంత్రం ఒక గంట పాటు యోగా సాధన చేస్తారు. యోగా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మెదడు, శరీరం చురుకుగా పనిచేయడానికి యోగా చాలా ముఖ్యమని ఉషా చెబుతున్నారు.
వాకింగ్
ఉషా సోమన్ ప్రతిరోజూ కచ్చితంగా వాకింగ్ చేస్తారు. క్రమ శిక్షణతో చేసే పని ఎప్పుడూ మనకు మేలు చేస్తుందని ఉషా చెబుతున్నారు.
ప్రపంచమే జిమ్
బీచ్ లో సైక్లింగ్ నుంచి పర్వతారోహణ వరకు ఉషా ప్రకృతితో మమేకమై ఉంటారు. ఫిట్ గా ఉండటానికి జిమ్ అవసరం లేదంటారు ఉషా సోమన్. ఖాళీ స్థలం ఉంటే చాలు ఎక్కడైనా వ్యాయామాలు చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
పట్టుదల
పట్టుదలతో చేస్తే సాధించలేనిది ఏది లేదని ఉషా సోమన్ నిరూపిస్తున్నారు. కఠినమైన పర్వతారోహణలలో కూడా ఆమెకు ఎలాంటి ఫిర్యాదులు లేవట. అంటే ఆమె పట్టుదల ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
కొత్త విషయాలు నేర్చుకోవడం
కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ మానద్దని ఉషా చెబుతున్నారు. 83 ఏళ్ల వయసులో ఉష మళ్లీ సైకిల్ తొక్కడం నేర్చుకుందట. ఫిట్నెస్ అంటే ఉత్సుకత, ధైర్యం, కొత్తగా ఏదైనా ప్రయత్నించడం కూడా అని ఆమె వివరించారు.
ఆనందంగా ఉండడం
సంతోషం సగం బలం అంటారు పెద్దలు. ఆనందం అన్నింటికి మంత్రంగా పనిచేస్తుంది అంటున్నారు ఉషా సోమన్. ఆమెకు నడక, సైక్లింగ్, ఆనందం, సంతృప్తిని ఇస్తాయట.
ప్రేరణ
ఉషా సోమన్ జీవనశైలి వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఆమె కొడుకు మిలింగ్ సోమన్ తో సహా. ఆదర్శంగా జీవిస్తే.. ఎవరైనా సరే మనల్నిఅనుసరిస్తారని ఉషా చెబుతున్నారు.
ఉషా సోమన్ స్టోరీ.. వయసు, జెండర్ చుట్టూ ఉన్న అడ్డంకులను ఛేదించిందనే చెప్పాలి. సరైన షూస్ లేవనో లేదా వ్యక్తిగత శిక్షకుడు లేడనో చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉంటారు. కానీ అవన్నీ అవసరం లేదని ఫిట్ గా ఉండాలనే బలమైన కోరిక ఉంటే చాలని ఉషా చెబుతున్నారు.