
మొన్నటి వరకు ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు నెమ్మదిగా వర్షాలు పడుతుంటే కాస్త ఎండ తీవ్రత నుంచి ఊరటగా అనిపిస్తుంది. కానీ, ఈ సీజన్ లో మన శరీరం, మెదడు అంత చురుకుగా ఏమీ ఉండదు. దీనివల్ల పనిలో ఆసక్తి తగ్గి నీరసంగా ఉంటుంది. అందుకే మళ్ళీ ఉత్సాహంగా ఉండటానికి ఒక కప్పు టీతో పాటు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది.
మనం తినే స్నాక్స్ ఏ రకంగా ఉన్నా అది మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలి. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే, ఈ సీజన్ లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.ఎలాంటి ఆహారం తినడం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎలాంటివి తినకుండా ఉండటం మంచిదో కూడా తెలుసుకోవాలి. మరి అవేంటో, వాటిని ఎందుకు తినకూడదో ఈ పోస్ట్‌లో చూద్దాం.
బండి మీద అమ్మే పానీపూరీ, బేల్‌పూరీ లాంటివి వర్షాకాలంలో తినకూడదు. వర్షాకాలంలో శుభ్రత, ఆరోగ్యం చాలా ముఖ్యం.
రోడ్డు పక్కన అమ్మే పండ్ల ముక్కలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాటి మీద దుమ్ము, ఈగలు, దోమలు వాలి వాటి మలినాలను వదిలి వెళ్తాయి.
వర్షాకాలంలో టీ కొట్టులో అమ్మే ఎండిపోయిన సమోసా, వడ, బజ్జీ లాంటివి తినకండి.
సాధారణంగా వర్షాకాలంలో తరచుగా కరెంట్ పోతుంది. చికెన్, మటన్ లాంటివి సరిగ్గా ఉండవు. అందుకే బయట వాటితో చేసినవి తినకుండా ఉండటమే మంచిది.
వర్షాకాలంలో చేప లాంటివి తాజాగా తినడమే ఆరోగ్యానికి మంచిది. లేదంటే వాటిని తినకండి.
వర్షాకాలంలో పాల ఉత్పత్తులతో చేసినవి త్వరగా పాడైపోతాయి. అందుకే వాటికి దూరంగా ఉండండి.
అలాగే రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం, నిమ్మకాయ సోడా లాంటివి వర్షాకాలంలో అస్సలు తాగకండి. ఎందుకంటే వాటిలో వేసే ఐస్ ఏ నీటితో చేశారో మనకు తెలియదు.
కొట్టులో అమ్మే ఫ్రెష్ సలాడ్ ఆరోగ్యానికి మంచిదే అయినా, దాన్ని కోయడానికి వాడే కత్తి, కోసే వ్యక్తి చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో మనకు తెలియదు. అందుకే దాన్ని కూడా తినకుండా ఉండటమే మంచిది.
గమనిక:
వర్షాకాలంలో మీకు ఇష్టమైన స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లో చేసుకుని వేడివేడిగా తిని వర్షాన్ని, చలిని ఆస్వాదించండి!!