
వయసు పెరుగుతుంటే.. తల మీద జుట్టు రాలడం చాలా సహజం. కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. చిన్న పిల్లలకు కూడా జుట్టు ఊడిపోతోంది.చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ జుట్టు రాలిపోతుందని బాధపడేవారే. ఈ కాలం అమ్మాయిల తలలో జుట్టు కంటే.. వాళ్ల అమ్మ, అమ్మమ్మలకే ఎక్కువ జుట్టు ఉంటోంది. ఇంకా చెప్పాలంటే..మన పెద్దవాళ్లు తలకు నూనె రాయడం, వారానికి ఒకసారి తలస్నానం చేయడం తప్ప, మరో హెయిర్ కేర్ ఫాలో అయ్యేవారే కాదు.. కానీ, వాళ్లు జుట్టు చాలా అందంగా ఉండేది. ఈ కాలం అమ్మాయిలు.. హెయిర్ కేర్ ఫాలో అవుతున్నారు.. ఖరీదైన నూనెలు, షాంపూలతో పాటు.. జుట్టు పెరగడానికి సీరమ్స్ కూడా వాడుతున్నారు. అయినా కూడా జట్టు రాలడం ఆగడంతో పాటు, హెయిర్ డ్యామేజ్ కూడా అవుతోంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే... కచ్చితంగా ఉంది. పూర్వం మన అమ్మలు, అమ్మలు ఫాలో అయిన చిట్కాలనే మనం కూడా ఫాలో అయితే కచ్చితంగా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. కేవలం కొబ్బరి నూనె మాత్రమే రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, కొబ్బరి నూనెలో కొన్ని సహజ పదార్థాలను కలిపి రాస్తే మాత్రం కచ్చితంగా ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోవాల్సిందే. ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తలకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఉల్లిపాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి తలపై చర్మ సమస్యలను నివారిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఎలా ఉపయోగించాలి: 2 టీస్పూన్ల కొబ్బరి నూనెను 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసంతో కలిపి తలపై అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. అరగంట తర్వాత, తేలికపాటి షాంపూ ఉపయోగించి మీ జుట్టును కడగాలి. జుట్టు పెరుగుదలలో మంచి మార్పును చూడటానికి వారానికి రెండుసార్లు దీన్ని వాడండి. సల్ఫేట్ లేని షాంపూలు వాడటం ఉత్తమం.
అలోవెరా జెల్: జుట్టు సంరక్షణకు కలబంద చాలా అవసరం. అలోవెరా, దాని ఎంజైమ్‌ల శీతలీకరణ లక్షణాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. 2 టీస్పూన్ల అలోవెరా జెల్‌ను 2 టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలిపి తల నుండి చివర్ల వరకు అప్లై చేసి 1 గంట తర్వాత శుభ్రం చేసుకోండి. మంచి జుట్టు పెరుగుదల కోసం వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి.
కరివేపాకు: కరివేపాకులో ప్రోటీన్, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు మంచి మూలం. ఇవి జుట్టు రాలకుండా ఉండేందుకు సహాయపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నూనెతో కలిపిన కరివేపాకు రసాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 1 గంట తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. లేకపోతే, కరివేపాకులను మెత్తగా పేస్ట్ చేసి, కొబ్బరి నూనె లో వేసి, కొన్ని నిమిషాలు మరిగించి చల్లబరచాలి. తర్వాత నూనె వడగట్టి... ఈ నూనెను వారానికి రెండుసార్లు నెత్తి నుండి జుట్టు చివరల వరకు అప్లై చేసి 1 గంట తర్వాత శుభ్రం చేసుకోండి.
ఆముదం: జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆముదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆముదంలోని రిసినోలిక్ ఆమ్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: 2 టీస్పూన్ల ఆముదం నూనెను 2 టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలిపి, కొద్దిగా వేడి చేసి, తలకు అప్లై చేయండి. తలకు 5 నిమిషాలు బాగా మసాజ్ చేసి, 1 గంట తర్వాత షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. దీన్ని వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలలో మంచి మార్పు కనిపిస్తుంది.
మెంతులు: మెంతులు జుట్టుకు అవసరమైన పోషకాలు ఐరన్, నికోటినిక్ ఆమ్లం, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: నానబెట్టిన మెంతుల గింజలను పేస్ట్‌గా రుబ్బి, కొబ్బరి నూనెతో కలిపి, తల నుండి జుట్టు చివరల వరకు అప్లై చేయండి. అరగంట తర్వాత, షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. జుట్టు పెరుగుదలలో మంచి మార్పు చూడటానికి వారానికి రెండుసార్లు దీన్ని ఉపయోగించండి.