
వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది తెలీకుండానే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఆరోగ్యం కంటే.. తమ అందం తగ్గిపోతుందనే భయమే ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ, వయసు పెరిగినా.. ఆ ఛాయలు ముఖంలో కనిపించకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ, అలా కనిపించాలి అంటే.. వేల రూపాయలు ఖర్చు చేసి.. ఫేస్ కి ట్రీట్మెంట్లు చేయించుకోవాలని, లేదా ఖరీదైన క్రీములు రాయాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, అవేమీ లేకపోయినా.. మన అందాన్ని కాపాడుకోవచ్చు.
మార్కెట్లో దొరికే క్రీములు కొని రాయడం చాలా మంది చేస్తూ ఉంటారు. వాటి వల్ల కొద్ది రోజులు అందంగా కనిపించినా, తర్వాత కొంతకాలానికి వాటి కారణంగానే స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. దానిలోని కెమికల్స్ ముఖాన్ని మరింత పాడు చేస్తాయి. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడానికి కారణం అవుతాయి. అందుకే, అలాంటి వాటికి దూరంగా ఉంటూ.. సహజంగా అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
మనం తినే ఆహారాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో , యవ్వన చర్మాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. అందుకే.. మీరు అందంగా కనిపించాలి అంటే.. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం...
చక్కెర: చాక్లెట్, కేకులు, టీ, కాఫీ , చక్కెర పానీయాలు, స్వీట్లు తీసుకోవడం వల్ల అవి మన చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని ఫలితంగా చర్మంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వస్తాయి. చక్కెర తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. వీటిని తినడం మానేయాలి.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు: శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అవి చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతాయి. మొటిమలకు దారితీస్తాయి. కాబట్టి మైదా రోటీ, వైట్ రైస్, పాస్తా వంటి ఆహారాలను నివారించాలి. వైట్ రైస్ ని ఎక్కువ కూరగాయాలు, పప్పు లాంటి వాటితో బ్యాలెన్స్డ్ గా తీసుకోవచ్చు.
పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తీవ్రమవుతాయి. ఉదాహరణకు, టీ , కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మొటిమలు తీవ్రమవుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, వీటికి కూడా వీలైనంత వరకు దూరంగా ఉ:డాలి.
ప్రాసెస్ చేసిన మాంసం: ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం, సంతృప్త కొవ్వులు , నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మంపై వాపు, ముడతలకు కారణమవుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ప్యాక్ చేసిన, ఫ్రీజ్ చేసిన, హాట్ డాగ్‌లతో సహా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకుండా ఉండండి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఫాస్ట్ ఫుడ్: ఫాస్ట్ ఫుడ్‌లో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ , శుద్ధి చేసిన నూనెలు ఉంటాయి. ఇది మంటను పెంచుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి కారణం అవుతాయి. ఇవి మొటిమలు , పగుళ్లు వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయి. అందుకే, వేయించిన , డీప్-ఫ్రై చేసిన ఆహారాలను నివారించడం మొత్తం ఆరోగ్యానికి మంచిది.
సోడియం అధికంగా ఉండే ఆహారాలు: సోడియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ముఖం , కళ్ళ కింద ఉబ్బరం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చిప్స్, రెడీమేడ్ సూప్‌లు , ఫ్రోజెన్ ఆహారాలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలను నివారించండి. ఈ ఫుడ్స్ కి దూరంగా ఉంటే.. మీరు మీ అందాన్ని కొంతకాలం కాపాడుకున్నవారు అవుతారు.