
ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది గొప్ప వరం. తల్లి కావాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. గర్భధారణ సమయంలో మహిళల్లో చాలా హార్మోన్ల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రసవానంతరం జుట్టు రాలిపోవడం అత్యంత సాధారణంగా కనిపించే సమస్య. కానీ, జుట్టు రాలడం ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది. అసలు.. డెలివరీ తర్వాత అసలు మహిళలకు జుట్టు ఎందుకు రాలుతుంది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి చాలా అధికంగా ఉంటుంది. ఈ హార్మోన్ జుట్టు పెరుగుదల దశను పొడిగిస్తుంది. దీంతో గర్భిణీ అయిన మహిళకు జుట్టు మందంగా, మెరిసేలా కనిపిస్తుంది. కానీ ప్రసవానంతరం ఈస్ట్రోజెన్ స్థాయి మామూలు స్థితికి తగ్గుతుంది. దీంతోపాటు ఉన్న జుట్టు హార్మోన్ల మార్పు వల్ల ఒక్కసారిగా రాలిపోతుంది. దీనిని టెలోజెన్ ఎపువియం అంటారు. ఇది సాధారణంగా ప్రసవం తర్వాత 2 నుంచి 4 నెలల్లో మొదలవుతుంది.6 నుంచి 12 నెలల వరకు కొనసాగుతుంది.
అయితే జుట్టు విపరీతంగా రాలడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. జుట్టు ఊడిపోయి, తాము అందవిహీనంగా కనిపిస్తామనే భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని నిపుణులు చెబుతున్నారు. శరీరం మళ్లీ సమతుల్యంలోకి వచ్చినప్పుడు జుట్టు మళ్లీ పెరుగుతుంది. అయితే ఈ దశలో సరైన పోషణ, సహజ చికిత్సలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను త్వరగా అధిగమించవచ్చు.
ఉసిరికాయ తెలియనివాళ్లు ఉండరు. ఈ ఉసిరికాయకి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిలో విటమిన్ C, ఐరన్, కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, ఆరోగ్యానికి, ముఖ్యంగా జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
ఉసిరికాయ రసం వల్ల కలిగే లాభాలు:
జుట్టు కుదళ్లు బలపడతాయి..ఉసిరికాయలో ఉండే విటమిన్ C కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరచి, కొత్త జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం : ఉసిరికాయ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఇది జుట్టు రాలే పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్త ప్రసరణ మెరుగవుతుంది: ఉసిరికాయ రసం తాగడం వల్ల తల చర్మానికి అవసరమైన రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చుండ్రు నివారణ: ఉసిరికాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
హార్మోన్ల సమతుల్యం: ప్రసవం తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 20 మిల్లీ లీటర్ల ఉసిరికాయ రసం తాగాలి.దాన్ని తేనె లేదా నీటితో కలిపి తాగవచ్చు. అప్పుడు చేదుగా ఉండదు.
కనీసం 6 వారాల పాటు నిరంతరంగా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రసం తీసుకోలేకపోతే పొడి రూపంలో తీసుకోవచ్చు.
జుట్టు రాలడం తగ్గాలంటే ఇవి కూడా చేయవచ్చు..
జుట్టు రాలడం తగ్గాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి .ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
జుట్టుకు సహజ నూనెలు పూయాలి – కొబ్బరి నూనె, కస్తూరి మెంతి నూనె, ఉసిరికాయ నూనె వంటి సహజ నూనెలు వాడాలి.
స్ట్రెస్ కంట్రోల్ – సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. రసాయనాలు లేని షాంపూలు, కండిషనర్లు వాడాలి.