అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల క్రీములు ముఖానికి పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల అందం పక్కన పెడితే... ముఖం మరింత డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా.. మనకు చాలా సులభంగా లభించే కేవలం రెండింటిని వాడి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం...
చర్మ సంరక్షణలో గంధానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలం నుంచే దీన్ని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. గంధాన్ని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారడమే కాకుండా.. మొటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గంధంలో సహజ శీతలీ గుణాలు ఉంటాయి. అవి.. మన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ గంధాన్ని ముఖానికి ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
24
గంధంతో ఫేస్ ప్యాక్...
గంధపు ఫేస్ ప్యాక్‌ను అలొవెరా జెల్‌తో కలిపి ఉపయోగిస్తే అందం రెట్టింపు అవుతుంది. అలొవెరా జెల్‌లో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమల సమస్యను తగ్గిస్తాయి. అలాగే రోజ్ వాటర్ కలపడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా మారి, ముఖం మృదువుగా మారుతుంది. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వాడడం వల్ల చర్మం డీప్ గా క్లీన్ అవుతుంది.
34
గంధం-కలబంద ఫేస్ ప్యాక్ తయారీ విధానం
మొదట ఒక గిన్నెలో రెండు టీస్పూన్లు గంధపు పొడి వేసి, దానిలో ఒక టీస్పూన్ అలొవెరా జెల్ , ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించి మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత బ్రష్ లేదా వేళ్ల సహాయంతో ఈ ప్యాక్‌ను ముఖంపై సమానంగా రాయాలి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
గంధపు ఫేస్ ప్యాక్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ ప్యాక్ వాడటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా సన్‌బర్న్ వల్ల వచ్చే ఎరుపు కూడా తగ్గుతుంది. మొటిమల సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. అలొవెరా జెల్ చర్మాన్ని హీలింగ్ చేయడం వల్ల గాయాలు లేదా చిన్న మచ్చలు మాయమవుతాయి. రోజ్ వాటర్ కలపడం వల్ల చర్మం తేమతో నిండిపోతుంది. ఈ మిశ్రమం వాడిన తర్వాత చర్మం ప్రకాశవంతంగా మారి సహజ కాంతిని ఇస్తుంది.
గంధపు పొడి ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు గంధపు పొడిని జాగ్రత్తగా వాడాలి. లేకపోతే పొడిబారే ప్రమాదం ఉంటుంది. గంధపు పొడి ఆరిన తర్వాత బలంగా రుద్దకూడదు, ఎందుకంటే అది చర్మంపై ముడతలను కలిగించే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పదార్థాన్ని గంధంతో కలపాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఫైనల్ గా...
గంధపు ఫేస్ ప్యాక్ అనేది సహజమైన సౌందర్య రహస్యం. దీన్ని వారానికి ఒకసారి వాడటం ద్వారా చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది. సహజమైన ఈ ప్యాక్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల రసాయనాలపై ఆధారపడకుండా సులభంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.