IMD Rain Alert : బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగానే మరోటి ఏర్పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు తప్పేలా లేవంటోంది. ఏఏ ప్రాంతాలకు వర్షసూచనలు ఉన్నాయంటే..
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు ఈ వేసవి కాలంలో వర్షాలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే ఓ అల్పపీడనం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 20, శుక్రవారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
25
తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు
గతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది... కానీ తాజా అల్పపీడనం ముందుకు సాగుతూ బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ఉంటుందని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. రేపటి నుండి (ఫిబ్రవరి 21, శనివారం) నుండి వర్షాలు మొదలవుతాయని... రెండుమూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
35
ఏపీలో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అల్పపీడనం ప్రభావంతో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతవరణ విభాగం ప్రకటించింది. తమిళనాడును ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 21న, ఇక దక్షిణకోస్తా ప్రాంతాల్లో ఫిబ్రవరి 22న వర్షాలు కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి ఈ రెండ్రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
తెలంగాణలో కూడా వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 22) నుండి అల్పపీడనం ప్రభావం కనిపిస్తుందని... వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 23,24 (సోమ, మంగళవారం) వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో చిరుజల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల 30 నుండి 40 మిల్లిమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయట.
55
వేసవిలో వర్షాలు ప్రమాదకరం..
వేసవి కాలంలో కరిసే వర్షాలు చాలా ప్రమాదకరం... ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువ. ఇక బలమై ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయి. ఒక్కోసారి వడగళ్ల వానలు కూడా పడుతుంటాయి. వీటివల్ల ప్రజలు ప్రమాదాలబారిన పడుతుంటారు... ప్రాణనష్టం జరుగుతుంది. ఇక బలమైన గాలులు, వడగళ్ల వానతో పంటనష్టం జరిగి రైతులు నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.