IMD Cold Wave Alert : హైదరాబాద్ లో చలి చంపేస్తోంది… ఆదిలాబాద్ కంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నగరంలోనే నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో చలి ఉందో అర్థం చేసుకోవచ్చు.
IMD Cold Wave Alert : తెలుగు ప్రజలను చలి గజగజా వణికిస్తోంది. ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఇకపై మరింత దిగువకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా అటవీ, కొండప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కానీ ఆశ్చర్యకరంగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
27
హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్స్
తెలంగాణలో అత్యల్పంగా హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో 6.4, రాజేంద్ర నగర్ లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బేగంపేటలో 11.7, హయత్ నగర్ లో 13, హకీంపేటలో 12.7, దుండిగల్ లో 15.4 ఉష్ణోగ్రతలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
37
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 7.7, మెదక్ లో 09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో 11, రామగుండంలో 12, నిజామాబాద్ లో 12.3, ఖమ్మంలో 14,నల్గొండలో 14, మహబూబ్ నగర్ లో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 10 నుండి 20 డిగ్రీలలోపే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరికొన్నిరోజులు చలి తీవ్రత ఉంటుందని... క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు మరింత దిగువకు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని... రాబోయే రెండుమూడు రోజుల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని తెలిపారు.
57
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయట... అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
67
ఈ జిల్లాలో స్కూల్ టైమింగ్స్ చేంజ్
ఉష్ణోగ్రతలు కుప్పకూలడంతో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చలి గజగజా వణికిస్తోంది... అలాగే దట్టమైన పొగమంచు కురుస్తోంది. తెల్లవారుజామన పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది... చలి, పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 9 గంటలవరకు చలి తగ్గడంలేదు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ టైమింగ్స్ లో మార్పులు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్. దీంతో ఆదిలాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉదయం 9 గంటలకు కాకుండా 9:40 కి ప్రారంభం అవుతున్నాయి... సాయంత్రం 4:15 కు కాకుండా 4:30 వరకు కొనసాగుతున్నాయి.
77
ఏపీపై చలి పంజా
ఆంధ్ర ప్రదేశ్ లో చలి తెలంగాణ కంటే దారుణంగా ఉంది... ఇక్కడ ఏకంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకులో 3, మినుమలూరులో 5, పాడేరులో 7, చింతపల్లిలో 7.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన చలి నేపథ్యంలో ముసలివారు, చిన్నారులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఇబ్బంది పడతారు... కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.