Medak Church: చర్చిలు ప్రార్థనలు చేసే భవనాలు మాత్రమే కాదు. విశ్వాసం, చరిత్ర కలిసిన స్థలాలు. ప్రతి క్యాథడ్రల్ నిర్మాణానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రత్యేక స్థలాల్లో తెలంగాణలోని మెదక్ క్యాథడ్రల్ ఒకటి. ఈ చర్చికి సంబంధించిన ఆసక్తికర విషయాలు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విశిష్టమైన పర్యాటక కేంద్రంలో మెదక్ క్యాథడ్రల్ చర్చి ఒకటి. ఆసియాలో రెండో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరంగా గుర్తింపు పొందిన ఈ చర్చి, 2024తో వందేళ్లు చరిత్రను పూర్తి చేసుకుంది. శత వసంతాలు గడిచినా చెక్కుచెదరని కట్టడంగా నిలిచిన ఈ క్యాథడ్రల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సందర్శించేందుకు వస్తుంటారు. క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చి నిర్మాణం వెనకాల ఉన్న ఆసక్తికర చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
28
ఎత్తు, వెడల్పు, గోతిక్ శైలి ప్రత్యేకత
175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ మహా కట్టడం దూరం నుంచే సందర్శకులను ఆకర్షిస్తుంది. రెండు అంతస్తుల్లో రూపొందించిన ఈ ప్రార్థనా మందిరం గోతిక్ నిర్మాణ శైలికి ప్రతిరూపం. పిల్లర్లు, భీములు లేకుండానే ఇంత భారీ నిర్మాణాన్ని నిలబెట్టడం అప్పటి నిపుణుల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
38
పటిష్ట నిర్మాణ రహస్యం
ఈ చర్చి నిర్మాణంలో రాతి, డంగు సున్నం తప్ప మరో పదార్థం ఉపయోగించలేదు. భారతీయ పురాతన నిర్మాణ పద్ధతులను అనుసరించడంతో భవనం అపారమైన బలాన్ని సంపాదించింది. శిఖరం, గోడలు, అంతర్గత నిర్మాణం వందేళ్లు గడిచినా ఎలాంటి నష్టం లేకుండా నిలిచాయి.
చర్చి లోపల ఉన్న రంగురంగుల గాజు కిటికీలు ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. క్రీస్తు జననం, సిలువ వేయడం, ఆరోహణం వంటి దృశ్యాలు ఈ గాజు చిత్రాల్లో కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. ఈ గాజు ముక్కలపై చిత్రణ అంతా ఇంగ్లాండ్‌లో జరిగింది. అక్కడి నుంచి విడివిడిగా తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. సూర్య కిరణాలు పడినప్పుడే ఈ చిత్రాలు దర్శనమిస్తాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యలో మాత్రమే ఈ అద్భుతం కనిపిస్తుంది.
58
వెలుగు, శబ్దం వెనుక దాగిన శాస్త్రం
ఉత్తర దిశలో ఉన్న మూడో కిటికీపై నేరుగా సూర్యకాంతి పడదు. అయినా అది ప్రకాశిస్తుంది. రాళ్లపై పడిన కాంతి వక్రీభవనం చెంది అక్కడికి చేరడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మరో విశేషం ఏమిటంటే చర్చి లోపల ఎలాంటి రీసౌండ్ వినిపించదు. సౌండ్ ప్రూఫ్ విధానంలో పైకప్పు నిర్మాణం చేశారు.
68
కరవు కాలంలో ఉపాధిగా మారిన నిర్మాణం
1914లో మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తున్న సమయంలో ఈ చర్చి నిర్మాణం ప్రారంభమైంది. దేశం మొత్తం కరవు పరిస్థితులతో అల్లాడుతున్న రోజుల్లో చార్లెస్ వాకర్ అనే బ్రిటిష్ మిషనరీ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పని ప్రారంభమైంది. ఆరో నిజాం ఈ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారు. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు పని చేసి జీవనాధారం పొందారు.
78
ఆధ్యాత్మికం, పర్యాటకం
1924 డిసెంబర్ 25న ఈ క్యాథడ్రల్ పూర్తి అయింది. అప్పట్లో రూ.14 లక్షల వ్యయం కాగా, ఇటీవల రూ.2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వంటి పర్వదినాల్లో దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తారు. క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా భక్తితో దర్శించుకుంటారు.
88
ఎలా వెళ్లాలి.?
హైదరాబాద్ నుంచి మెదక్ చర్చి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జేబీఎస్ నుంచి నేరుగా మెదక్‌కు బస్సులు ఉన్నాయి. మెదక్ బస్టాండ్ నుంచి చూస్తే చర్చి కనిపిస్తుంది. ఇక సొంత వాహనాలు ఉన్న వారు బాల్‌నగర్, దుండిగల్, నర్సాపూర్ మీదుగా మెదక్‌కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం ఒక్క రోజులో మెదక్ చర్చిని దర్శించుకుని తిరిగి రావొచ్చు.