Hyderabad to Delhi Vande Bharat Sleeper Train : దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ గౌహతి-హౌరా మధ్య ప్రయాణించనుంది. మరి రెండో స్లీపర్ మన తెలుగు రాష్ట్రానికేనా..?
Vande Bharat Sleeper Train : వందే భారత్ ట్రైన్స్... భారతీయ రైల్వేలో ఓ విప్లవాన్ని తీసుకువచ్చాయని చెప్పవచ్చు. అవే పాత రైళ్లు, అవే బోగీలు, అవే సీట్లు... ఇండియన్ రైల్వే అంటే ఇదే అభిప్రాయం ఉండేది. కానీ వందే భారత్ రైళ్ల రాకతో ఇది పూర్తిగా మారిపోయింది... వేగమే కాదు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ వందేభారత్ ను న్యూ జనరేషన్ ట్రైన్ గా పేర్కొనడంతో అతిశయోక్తి లేదు. ఇలాంటిది ఇప్పుడు వందేభారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్దమయ్యింది. దక్షణాదిలో మొదటి వందే భారత్ స్లీపర్ తెలగు రాష్ట్రాల్లో పరుగు పెట్టనుందని సమాచారం.
24
డిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్..
ఇండియన్ రైల్వేస్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమయ్యింది. న్యూ ఇయర్ కానుకగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అస్సాంలోని గౌహతి రైల్వే స్టేషన్ నుండి పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ మధ్య మొదటి ట్రైన్ నడుస్తుందని...జనవరి 2026 మధ్యలో లేదంటే చివర్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యిందని మంత్రి ప్రకటించారు.
అయితే తెలుగు ప్రజలకు ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే... దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ స్లీపర్ హైదరాబాద్ కు నడవనున్నట్లు సమాచారం. దేశ రాజధాని డిల్లీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాల మధ్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు... వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ లగ్జరీ ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది.
34
వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే..
స్లీపర్ ట్రైన్ కూడా ఇప్పుడు నడుస్తున్న వందేభారత్ ట్రైన్స్ మాదిరిగా అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. దీని వేగం కూడా గంటకు 180 కిలో మీటర్లు. అయితే సాధారణ వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చుని మాత్రమే ప్రయాణించగలం... కానీ కొత్త స్లీపర్ ట్రైన్ లో హాయిగా పడుకుని ప్రయాణించేలా సౌకర్యవంతమైన బెర్తులు ఉన్నాయి. కాబట్టి సుదూర ప్రయాణాలను వేగంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్.
వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు, 823 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. వదే భారత్ స్లీపర్ రైలులో సెన్సార్ ఆధారిత తలుపులు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సస్పెన్షన్, తక్కువ శబ్దం చేసే టెక్నాలజీ ఉన్నాయి. భద్రత కోసం 'కవచ్' వ్యవస్థ, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ఉన్నాయి. మోడ్రన్ టాయిలెట్స్ తో పాటు అత్యాధునిక శానిటేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది వందే భారత్ స్లీపర్.
వందే భారత్ స్లీపర్ ను ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమీషన్ టెస్ట్ రన్ చేపట్టింది. ఈ ప్రయాణం ఎంత స్మూత్ గా సాగిందో ఓ ప్రయోగం ద్వారా తెలియజేస్తున్నామంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ 180 కి.మీ హైస్పీడ్ తో వెళ్లినా కనీసం గ్లాస్ లోని నీరు ఒలికేస్ధాయి కుదుపులు కూడా లేవంటూ ప్రయాణానికి సంబంధించిన వీడియోను విడుదలచేశారు. కాబట్టి ఓవర్ నైట్ జర్నీ కోసం ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని... స్లీపర్ ప్రయాణానికి సరికొత్త అర్థం చెబుతుందని రైల్వే మంత్రి గర్వంగా తెలిపారు.