కార్మిక వర్గాల్లో ఆగ్రహం.. జిల్లా బంద్ పిలుపు
ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. డిపోల ముందు నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజకీయ ప్రతిస్పందనలు..
శంకర్ గౌడ్ మృతి పై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధమైందని తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రభుత్వం చర్చలకు సిద్ధం.. కార్మికులకు విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడవద్దని కోరుతూ, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు.
సమ్మె ఉధృతం.?
శంకర్ గౌడ్ మరణం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసనలు మరింత పెంచే యోచనలో ఉన్నాయి. శుక్రవారం (నేడు) జరగబోయే ప్రభుత్వం-కార్మిక సంఘాల చర్చల ఫలితంపైనే సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉందని ఐకాస నేతలు పేర్కొంటున్నారు.