
School Holidays : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు కొన్నిజిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండటంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇలా కామారెడ్డి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు రేపు(సెప్టెంబర్ 28, గురువారం) సెలవు ప్రకటించారు.
భారీ వర్షాలతో కామారెడ్డిలో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో వర్షపు నీరు జనావాసాలను ముంచెత్తుతోంది... దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వరదల ధాటికి కామారెడ్డి జిల్లా అతాలాకుతలం అవుతోంది... జాతీయ రహదారుతలపై వరద నీరు ప్రవహిస్తుందంటేనే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేపు(గురువారం) కూడా భారీ వర్షాలు, ఈ వరద పరిస్ధితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలోనే విద్యాశాఖ అప్రమత్తమయ్యింది. కామారెడ్డి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డిఈవో) రాజు జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు... ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల సమయంలో విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని.. తల్లిదండ్రులు వారిని బయటకు పంపకూడదని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలన్నింటికి ఈ సెలవు వర్తిస్తుంది.
తెలంగాణలో భారీ వర్షాలతో వరద పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్నచిన్న గ్రామాలు, పట్టణాల మధ్యే కాదు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఇలా హైదరాబాద్, నిజామాబాద్ మధ్యగల 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ముఖ్యంగా తూఫ్రాన్, మనోహరాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ఈ హైవేపైకి వరదనీరు చేరింది... దీంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయి.
ఇక కామారెడ్డి జిల్లాలో వరదనీరు రైల్వే ట్రాక్ ను ముంచెత్తింది. దీంతో కామారెడ్డి-నిజామాబాద్ మధ్య నడిచే రైళ్ళను రద్దుచేశారు అధికారులు. వర్షాలు తగ్గి ట్రాక్ ను పునరుద్దరించిన తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి.. అప్పటివరకు కామారెడ్డి నుండి రైలు ప్రయాణం సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.
కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి అంతకంతకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ వర్షాలు రేపు(గురువారం) కూడా కొనసాగే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పంటనష్టంతో పాటు రోడ్లు, రైల్వే ట్రాక్ పై వరదనీరు చేరడంతో ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం కలిగింది. ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం జరక్కుండా ఉండేందుకు అధికారులు ముందజాగ్రత్త చర్యలు చేపట్టారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి... ఆగస్ట్ ఆరంభంనుండి కుండపోత వానలు కురుస్తుండగా మద్యలో కొంత విరామం ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మొదలయ్యాయి... ఈ వర్షాలు ఈ నెలంతా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ తో పాటు భారీ వర్ష సూచనలున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయి.. ఇప్పటికే కొన్నిచోట్ల కుండపోత వానలు మొదలయ్యాయి. ఇక మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు... అంటే ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి.
భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ముందుజాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇవాళ(బుధవారం) జోరువాన కురుస్తున్నా వినాయక చవితి నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఉంది… కాబట్టి వర్షాలు కారణంగా ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరం రాలేదు. కానీ రేపు(గురువారం) మాత్రం భారీ వర్షాలుండే అవకాశాలున్న హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు.
హైదరాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని... పొంగిపొర్లుతున్న చెరువులు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు వంకల పరిసరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు.
హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని… నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరకోస్తా ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశా,రు.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షసూచనలున్న ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రేపు, ఎల్లుండి (గురు, శుక్రవారం) భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి... సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.