తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Published : Aug 27, 2025, 09:10 AM IST

Telangana, Andhra Pradesh Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. రాబోయే మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ అంచనా వేసింది.  

PREV
15
తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం

Telangana, Andhra Pradesh Weather update: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి పగపట్టారా? మరో మెరుపు దాడికి మేఘాలు సిద్ధమయ్యాయా? అంటే అవుననే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. తడిసిముద్దైన ఏపీ, తెలంగాణలకు మరోసారి వణికిపోయే వెదర్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను ప్రకటించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

25
తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి కుండపోత వర్షం కురువడం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని కారణంగా ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

మంగళవారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 3.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 3.3 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మలిచెలమలో 3.3 సెం.మీ., ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో 3.2సెం.మీ., వికారాబాద్ జిల్లా బంట్వారంలో 3.2 సెం.మీ., ములుగు జిల్లా వెంకటాపురంలో 3.2సెం.మీ., ఖమ్మం జిల్లా పంగిడిలో 3.2సెం.మీ., వరంగల్ జిల్లా కల్లెడలో 3.1సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

35
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇవి కాకుండా, జనగాం, భూపాలపల్లి, గద్వాల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు అంచనా వేశారు. 

హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) ప్రకటించింది.

45
తడిసిముద్దైన ఉత్తరాంధ్ర

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తడిసి ముద్దవుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసాయి. అనకాపల్లి సాలపువానిపాలెంలో 6 సెంటీమీటర్లు, శ్రీకాకుళం 5.8 సెంటీమీటర్లు, ఇతర ప్రాంతాల్లో 5–5.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. పలు జాతీయ రహదారులు జలమయమవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

55
వాతావరణ శాఖ హెచ్చరిక

అల్ప పీడనం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF దళాలు సిద్ధంగా ఉన్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండమని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101గా పేర్కొన్నారు.

హోంమంత్రి అనిత రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అదనంగా, క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు, సహాయక దళాలు ప్రజలకు సమయానుగుణంగా సహాయం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

Read more Photos on
click me!

Recommended Stories