Telangana Glass Bridge: తెలంగాణలో మొదటి హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జిని హుస్నాబాద్‌లో నిర్మిస్తున్నారు. రూ.18 కోట్లతో డెవలప్‌మెంట్ పనులతో ఎల్లమ్మ చెరువు పర్యాటక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.
తెలంగాణలోనే ఫస్ట్.. హుస్నాబాద్‌లో హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జి: మరో 3 నెలల్లో ఓపెనింగ్
తెలంగాణ పర్యాటక రంగం కొత్త అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి ఇది హార్ట్ షేప్ లో ఉండటం విశేషం. మూడు నెలల్లోనే పర్యాటకుల సందడి కోసం ఈ వంతెన సిద్ధం కానుంది.
25
రూ. 5 కోట్లతో గ్లాస్ వండర్
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో ఈ గ్లాస్ వంతెనను నిర్మిస్తున్నారు. దీని పొడవు 150 మీటర్లు కాగా, వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. నీటి మట్టానికి దాదాపు 20 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీనిపై నడుస్తుంటే గాలిలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుందనీ, దీనికోసం అత్యంత బలమైన ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇంజనీర్లు సేఫ్టీ టెస్టులు నిర్వహిస్తున్నారు.
35
హార్ట్ షేప్ అట్రాక్షన్.. కొత్త పర్యాటక హబ్
మొత్తం రూ. 18 కోట్ల భారీ వ్యయంతో ఎల్లమ్మ చెరువు ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలో దీనిని తీర్చిదిద్దుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హుస్నాబాద్‌ను ఒక మేజర్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనివల్ల స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
గ్లాస్ బ్రిడ్జితో పాటు ఇక్కడ మరిన్ని హంగులు సిద్ధమవుతున్నాయి. పర్యాటకుల కోసం అందమైన గార్డెన్లు, వాకింగ్ ట్రాక్, పచ్చదనంతో నిండిన ల్యాండ్‌స్కేప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ ఘాట్‌ను కూడా నిర్మిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి స్పెషల్ లైటింగ్ సిస్టమ్, సెల్ఫీలు దిగడానికి ప్రత్యేక ఫోటో పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఫ్యామిలీతో కలిసి వీకెండ్ గడపడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అవుతుంది.
55
మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి..
మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. సాంకేతిక పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని ఆయన చెప్పారు. మరో మూడు నెలల్లో అన్ని భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి, తుది మెరుగులు దిద్ది ప్రజల సందర్శనార్థం దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ టూరిజం మ్యాప్‌లో హుస్నాబాద్ పేరు మార్మోగిపోవడం ఖాయం.