
తెలంగాణలో 2023 సంవత్సరంలో బాలలపై నేరాలు తీవ్రంగా పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి నివేదిక వెల్లడిస్తోంది. చిన్నారులపై లైంగిక నేరాలు, కిడ్నాపింగ్ నేరాల అధికంగా కొనసాగుతుండగా.. ఈ నేరాల్లో కౌమార దశ బాలికలు ప్రధాన బాధితులుగా ఉన్నారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2023’ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో బాలలపై నేరాలకు సంబంధించిన గణాంకాలను CRY - చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ విశ్లేషింది. ఆ నివేదిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 2023లో మొత్తం 6,113 బాలలపై నేరాలు నమోదయ్యాయి. ఇది 2022తో పోలిస్తే 8.1% పెరుగుదల. 2020 తర్వాత కొనసాగుతున్న ఆందోళనకర పెరుగుదల ధోరణి ఇదే వేగంతో కొనసాగింది.
రాష్ట్రంలో 2023 వరకు ఐదేళ్లలో బాలలపై నేరాలు నిరంతరంగా పెరుగుతూ వచ్చాయి. 2020లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, 2021లో భారీగా పెరుగుదల తర్వాత కేసులు ఎప్పటికప్పుడు అధిక స్థాయిలోనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధిక నేరాలు నమోదైన సంవత్సరం 2023 కావడం, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సూచిస్తోంది.
చిన్నారులపై నమోదైన నేరాలలో 80% కంటే ఎక్కువ భాగం లైంగిక నేరాలు, కిడ్నాప్ కేసులదే. బాలలపై మొత్తం నేరాలలో POCSO చట్టం కింద నమోదైన నేరాలు 51.6% గా ఉన్నాయి. 2023లో మొత్తం లైంగిక నేరాలు 4,900 కేసులను దాటాయి. లైంగిక దాడి కేసులు మాత్రమే ఆ ముందటి ఏడాది 2022తో పోలిస్తే 38.3% పెరిగాయి.
POCSO కేసులు 15% పైగా పెరగడానికి.. నేర సంఘటనల పెరుగుదలతో పాటు, ఫిర్యాదులు సత్వరమే నమోదు కావడం కూడా కారణం కావచ్చు.
బాలల అపహరణ (కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్) కేసులు రాష్ట్రంలో నమోదైన బాలలపై నేరాల్లో రెండో స్థానంలో ఉన్నాయి. మొత్తం బాలలపై నేరాల్లో దాదాపు మూడో వంతు ఈ కేసులదే. ఇవి 2022తో పోలిస్తే 8% పైగా పెరిగాయి.
POCSO కేసులు, అపహరణ కేసులు కలిపి చూస్తే.. రాష్ట్రంలోని బాలలపై నేరాలలో 84% ఈ రెండు నేరాలదేనని తేలింది.
NCRB గణాంకాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో POCSO బాధితుల్లో 99.9% మంది బాలికలే. అదికూడా.. 12–18 సంవత్సరాల మధ్యనున్న బాలికలు.. మొత్తం బాధితుల్లో 92% మందిగా ఉన్నారు. వీరిలోనూ 16–18 సంవత్సరాల వయసు బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఈ సరళి.. కౌమార దశ బాలికలు లైంగిక హింస, మోసం, దోపిడీకి అత్యంత సులభంగా గురయ్యే అవకాశముందని నిర్ధారిస్తోంది.
NCRB సమాచారం చెప్తున్న అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. POCSO కేసులలో 99.8% నిందితులు బాధితులకు తెలిసినవారే. ఇందులోనూ కుటుంబ సభ్యులు, పొరుగువారు, యజమానులు, ముఖ్యంగా స్నేహితులు, ఆన్‌లైన్ పరిచయస్తులు మొత్తంగా 73% వీరే ఉన్నారు.
అంటే.. చిన్నారులకు, ప్రత్యేకించి బాలికలకు, అత్యధిక ప్రమాదం బయటివారి నుంచే కాకుండా, వారికి నమ్మకమైన వారి నుంచే వస్తోంది. డిజిటల్ పరిచయాలు కూడా ప్రమాద కారకంగా మారుతున్నాయి.
కొన్ని నేరాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. వాటి పెరుగదల ఎక్కువగా కనిపిస్తోంది. సైబర్ నేరాలు 400% కంటే ఎక్కువ పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 325% పెరిగాయి. బాలికల కొనుగోలు/సేకరణ దాదాపు రెండింతలు పెరిగింది.
ఇంకోవైపు, బాల్యవివాహాలు, బాలకార్మిక నేరాలు తగ్గినప్పటికీ, ఈ సమస్యలు ఇంకా బలహీన వర్గాలలో కొనసాగుతూనే ఉన్నాయి.
2023లో తెలంగాణలో మొత్తం 3,133 మంది చిన్నారులు కనిపించకుండా పోయినట్టు నమోదయింది. ఇందులో 509 పాత మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. వీరిలో 83.8% రికవరీ రేటుతో అత్యధికుల ఆచూకీ కనిపెట్టినప్పటికీ.. ఇంకా 506 మంది చిన్నారుల జాడ తెలియలేదు.
“తెలంగాణకు సంబంధించిన NCRB 2023 డేటా ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తోంది. ముఖ్యంగా కౌమార దశ బాలికలపై లైంగిక నేరాలను అరికట్టడానికి.. అత్యవసరంగా, భాగస్వాములందరి సమన్వయంతో పటిష్ట చర్యలు అవసరం” అని CRY – Child Rights and You సౌత్ రీజన్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ అన్నారు.
దీని కోసం ఆయన పలు సూచనలు కూడా చేశారు. వాటిలో
కమ్యూనిటీ విజిలెన్స్ బలోపేతం చేయాలి: గ్రామ బాలల రక్షణ కమిటీలు, వార్డు బాలల రక్షణ కమిటీలను బలోపేతం చేసి, తెలిసిన పరిచయస్తుల ద్వారానూ, ఆన్‌లైన్ పరిచయాలతోనూ వచ్చే ప్రమాదాలపై కమ్యూనిటీ అవగాహన పెంచాలి.
డిజిటల్ సేఫ్టీ ఎడ్యుకేషన్: పాఠశాలల్లో సైబర్ భద్రత, ఆన్‌లైన్ గ్రూమింగ్ నివారణ, బాధ్యతాయుత డిజిటల్ ప్రవర్తనపై పాఠ్యాంశాలు చేర్చాలి.
సహాయక వ్యవస్థల బలోపేతం: బాధిత బాలలకు ప్రత్యేకంగా బాలికల కోసం.. కౌన్సెలింగ్, లీగల్ ఎయిడ్, పునరావాస సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి.
సైబర్ నేరాల దర్యాప్తు, పర్యవేక్షణ: సైబర్ నేరాల దర్యాప్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫికింగ్ నెట్వర్క్‌లను నిర్వీర్యం చేయాలి, మిస్సింగ్ కేసులపై ఫాలో-అప్ మెరుగుపరచాలి.
“మన పిల్లల భద్రతకు, ముఖ్యంగా మన కుమార్తెల భద్రతకు – రాష్ట్రం, సమాజం అగ్రస్థాయి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జాన్ రాబర్ట్స్ పిలుపునిచ్చారు.